కార్డులు ఇవ్వకుండానే ఈహెచ్‌‌ఎస్‌‌ కటింగ్

కార్డులు ఇవ్వకుండానే ఈహెచ్‌‌ఎస్‌‌ కటింగ్
  • మే నెల వేతనం నుంచి 1.5 శాతం కోత 
  • ఉద్యోగులు, పెన్షనర్ల అసంతృప్తి

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్‌‌ఎస్) అమలు వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయకుండా మే నెల జీతంలో చందా పేరిట కోత విధించడంపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్కీమ్​నిర్వహణ కోసం ఎంప్లాయ్​హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులతోపాటు రాష్ట్రస్థాయి అధికారిని సీఈవోగా నియమిస్తూ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో వేతనంలో 1.5 శాతం ఈహెచ్‌‌ఎస్ ప్రీమియం కోత విధించినట్లు పే స్లిప్​లో చూపించడంతో ఉద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న ట్రస్ట్‌‌ కు సంబంధించిన జీవో గానీ, గైడ్‌‌లైన్స్ గానీ ఇంతవరకు ఇవ్వలేదు. వైద్య సేవల ప్యాకేజీ రేట్లు ఏంటి? ఏయే ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తారు? అనే విషయాలపై స్పష్టత లేకపోగా.. ఉద్యోగులకు కనీసం డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందలేదు. ట్రస్ట్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, కార్పొరేట్ హాస్పిటళ్లతో ఒప్పందం చేసుకున్నాకే ప్రీమియం వసూలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.