వడదెబ్బతోనే ఎనిమిది సింహం పిల్లలు మృతి

వడదెబ్బతోనే ఎనిమిది సింహం పిల్లలు మృతి

 

  • బాబేసియా ఇన్‌‌ఫెక్షన్ కారణం కాదన్న ఫారెస్ట్ మినిస్టర్ మోద్వాడియా
  • క్వారంటైన్‌‌లో కోలుకున్న 12 సింహాలు తిరిగి అడవిలోకి విడుదల

గాంధీనగర్: గుజరాత్‌‌లో ఇటీవల ఎనిమిది ఆసియా సింహం పిల్లలు మరణించడానికి ‘బాబేసియా’ ఇన్‌‌ఫెక్షన్, మరేదైనా వైరస్ కారణం కాదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా తెలిపారు. తీవ్రమైన వడదెబ్బల వల్లే అవి ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌‌కు తరలించిన 17 సింహాలలో 12 పూర్తిగా  కోలుకున్నాయని, వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి అర్జున్ మోద్వాడియా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘తీవ్రమైన ఎండలు, వాటి వల్ల కలిగిన నీరసం వల్లే ఎనిమిది సింహం పిల్లలు చనిపోయాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలే మృతి చెందాయి. దీనికి బాబేసియా ఇన్‌‌ఫెక్షన్ కారణం కాదు’’ అని స్పష్టం చేశారు.

చనిపోయిన సింహాలలో ఎలాంటి వైరస్‌‌లు లేవు

సింహం పిల్లలు వరుసగా మరణించడంతో బాబేసియా ఇన్ఫెక్షనే కారణమని భావించినట్టు మంత్రి అర్జున్ మోద్వాడియా వెల్లడించారు. ‘‘సింహం పిల్లల మరణంతో అప్రమత్తమైన అటవీ శాఖ.. ఆ పరిసర ప్రాంతాల్లోని సుమారు 600 సింహాలకు డీటికింగ్, డీవార్మింగ్ చికిత్స చేసింది. తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న 17 సింహాలలో 12 సింహాలను ఇప్పటికే విజయవంతంగా అడవిలోకి విడుదల చేశాం. మిగిలిన ఐదు సింహాలు కూడా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాయి, త్వరలోనే వాటిని కూడా సహజసిద్ధమైన ఆవాసాల్లోకి వదిలిపెడతాం’’ అని మంత్రి వివరించారు. ఇటీవలి కాలంలో ఎలాంటి వ్యాధుల వల్ల సింహాలు చనిపోలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో చనిపోయిన సింహాలలో కూడా ఎలాంటి ప్రమాదకర వైరస్‌‌లు గుర్తించలేదని స్పష్టం చేశారు.