పంటలకు ఎల్‌‌నినో గండం! ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే ..వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం

పంటలకు ఎల్‌‌నినో గండం! ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే ..వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
  • పంటలకు ఎల్‌‌నినో గండం!
  • ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే 
  • హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ
  • జులై చివరి దాకా నదులకు 
  • వరద ప్రవాహం కష్టమే 
  • వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
  • కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు 
  • సిద్ధం కావాలంటున్న శాస్త్రవేత్తలు
  • వరికి బదులు ఆరుతడి పంటల వైపు మళ్లాలి
  • వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలి
  • రసాయన ఎరువులు తగ్గిస్తే మేలు
  • సేంద్రియ ఎరువులతో నేలలో తేమ పదిలం
  • రైతులకు వ్యవసాయ, ఉద్యాన శాఖల సూచన


హైదరాబాద్, వెలుగు: దేశంలో వ్యవసాయ రంగంపై ఈఏడాది ‘ఎల్​నినో ఎఫెక్ట్’ తీవ్రంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 
ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ సంస్థలు ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. జులై, ఆగస్టు నాటికి ఎల్‌‌నినో 90 శాతం వరకు బలపడుతుందని డబ్ల్యూఎంవో స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్​ మన దేశంతో పాటు తెలంగాణపై కనిపిస్తుండగా, రుతుపవనాలు కూడా అంచనా వేసిన టైం కన్నా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించి నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నాటికి మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రమంతా విస్తరించేందుకు మరో నాలుగైదు రోజులు పడుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. 


అక్కడక్కడా వర్షాలు పడుతున్నా రాష్ట్రమంతా ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. మరోవైపు ఎండల ప్రభావమూ అధికంగానే ఉన్నది. అటు ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగానే ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి ప్రారంభమయ్యే మహారాష్ట్రలోనే వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని ఐఎండీ వార్నింగ్​ ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలోకి రుతుపవనాలు పావు వంతు భాగం కూడా విస్తరించలేదు. దీనివల్ల నదులకు వరద ప్రవాహం జూలై చివరి నాటికి కూడా మొదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్ర రైతులు మానసికంగా సిద్ధం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరికి బదులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని, సేంద్రియ ఎరువులతో నేలలో తేమను పదిలంగా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు.


కలవరపెడుతున్న కృష్ణమ్మ 


మహారాష్ట్రలో భారీ వర్షాలు పడి కృష్ణా, గోదావరి నదులకు వరదలు మొదలైతేనే మన ప్రాజెక్టులకు నీళ్లు వచ్చి చేరతాయి. గోదావరిలో పరిస్థితి ఎలాఉన్నా.. కృష్ణాలో పరిస్థితి మాత్రం కలవరపెడుతోంది. ఎగువన కర్ణాటకలో కీలకమైన ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులున్నాయి. ఎగువన వర్షాలు పడి ఆ ప్రాజెక్టులు నిండితేనే దిగువన మనకు నీళ్లొచ్చే అవకాశాలున్నాయి. ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడితే.. మనకు ఆగస్టుదాకా నీళ్లొచ్చే పరిస్థితి ఉండదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పంటలకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందడమూ గగనమవుతుంది.


 ఆరుతడి పంటలే మేలు.. 


ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతానికే పరిమితం కావొచ్చని ఐఎండీ అంచనా వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలోనూ వర్షపాతం అసమానంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులను అప్రమత్తం చేస్తున్నాయి. రైతులు ఎక్కువ నీటిని వినియోగించుకునే వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరమని హార్టికల్చర్​వర్సిటీ తాజాగా పేర్కొంది. మరీ ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆరుతడి, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించింది. ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్య మధ్యలో ఎండ తీవ్రత పెరగడం, సాగునీటి వనరుల ఎద్దడి పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపిక, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. 


వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు


రైతులు తొందరపడి విత్తనాలు వేయకుండా కనీసం 60 నుంచి 75 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు పడకముందే విత్తనాలు వేస్తే మొలక శాతం తగ్గడంతో పాటు మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మిర్చి, పసుపు, ధనియాలు, మునగ, క్లస్టర్‌‌బీన్‌‌, పాలకూర, ఔషధ, సుగంధ పంటలు వంటి వాటి సాగు రైతులకు మేలు చేస్తుందని హార్టికల్చర్​ అధికారులుచెబుతున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో స్వల్పకాలిక, ఎండను తట్టుకునే రకాల సాగు వల్ల నష్టాలు తగ్గుతాయని స్పష్టంచేస్తున్నారు.

 
ఈ కూరగాయలు అనుకూలం.. 


వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో టమాట (అర్క వికాస్, అర్క రక్షక్), వంకాయ (శ్యామల, భాగ్యమతి), మిర్చి (తేజ, ఎల్​సీఏ 334), బెండకాయ (అర్క ఆనమికా, లలిమా), మునగ (పీకేఎం 1, పీకేఎం 2), క్లస్టర్ బీన్ (పూసా నవభార్), బొబ్బర్లు (అర్క గరిమా), పందిరి కూరగాయల్లో (కాకర, బీర, సొర, దోస), పాలకూర (ఆల్ గ్రీన్, అర్క అనుపమా) వంటి రకాల పంటలు అనుకూలంగా ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పురుగులు, శిలీంద్రాలను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నియంత్రించాలని సూచిస్తున్నారు.


రసాయన ఎరువులు తగ్గించాలి.. 


నీటి కొరత పరిస్థితుల్లో అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగం పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేలలో తేమ తక్కువగా ఉన్నప్పుడు రసాయన ఎరువులు పూర్తిస్థాయిలో ఉపయోగపడకపోవడంతో పాటు మొక్కలపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. అందువల్ల రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.


సేంద్రియ ఎరువులతో తేమ నిల్వ


పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్‌‌, వేప చెక్కలు, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాల వినియోగంతో నేల సారవంతం పెరగడంతో పాటు నీటి వినియోగ సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు పద్ధతులు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు రైతులకు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు.


డ్రిప్‌‌, మల్చింగ్‌‌తో నీటి పొదుపు


ఎల్‌‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ చర్యలు అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌, ఫర్టిగేషన్‌‌ విధానాలు, మల్చింగ్‌‌, పంట కుంటల ఏర్పాటు, ఎత్తైన బెడ్లపై సాగు వంటి పద్ధతులు నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తాయని సూచిస్తున్నారు. ఉద్యాన పంటలలో డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌ను తప్పనిసరిగా అమలు చేయాలని రైతులకు సూచిస్తున్నారు.


మామిడి, జామ తోటల్లో కత్తిరింపులు చేపట్టాలి..


మామిడి, జామ, సీతాఫలం తోటల్లో కత్తిరింపులు చేపట్టి నీటి అవసరాన్ని తగ్గించాలని, నారింజ, బత్తాయి, నిమ్మ తోటల్లో మల్చింగ్‌‌ ద్వారా నేల తేమను కాపాడాలని హార్టికల్చర్‌‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్‌‌పామ్‌‌, అరటి, కొబ్బరి, కోకో వంటి పంటల్లో నీటి యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతున్నారు. కూరగాయల సాగులోనూ ఎండను తట్టుకునే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.


రైతులు ముందస్తు ప్రణాళికతోనే నష్టాల నివారణ


వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల ఎంపిక నుంచి నీటి వినియోగం వరకు ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎల్‌‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన, సాగునీటి, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తే పంట నష్టాలను తగ్గించడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హార్టికల్చర్​ వర్సిటీ సూచించిన అంశాలు ఇవే..
    60–75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైన తర్వాతే నేలలో విత్తనం చేయాలి.
    నీటి సంరక్షణ కోసం ఎత్తైన బెడ్లు, మల్చింగ్, పంట కుంటలు ఏర్పాటు చేయాలి.
    ఇరిగేషన్, ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యం పెంచాలి.
    పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, వేప చెక్కలు వంటి సేంద్రియ ఎరువులు వాడి నేల తేమ నిల్వ చేయాలి.
    సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా పురుగులు, శిలీంద్రాలను నియంత్రించాలి.
    సాధ్యమైన ప్రతి చోట ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలి.


ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలి


ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి, స్వల్పకాలిక పంటలను సాగుచేయాలి. డ్రిప్‌‌, మల్చింగ్‌‌, సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల తేమను కాపాడుకోవాలి. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు
- డాక్టర్​ దండా రాజి రెడ్డి, వైస్ చాన్స్‌‌లర్, హార్టికల్చర్ వర్సిటీ