గ్రామ సర్పంచ్‌ పోటీకి ఉండాల్సిన అర్హతలు

గ్రామ సర్పంచ్‌ పోటీకి ఉండాల్సిన అర్హతలు

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. అయితే సర్పంచ్‌గా పోటీ చేయాలంటే కొన్ని అర్హతలుండాలి. ఏ మాత్రం తేడా వచ్చిన అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. సర్పంచ్‌ ఎన్నికల క్రమంలో పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలుండాలో ఎన్నికల సంఘం ప్రకటించింది.

సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పంచాయతీ ఓటర్ల లిస్టులో పేరు నమోదై ఉండాలి. వయసు నామినేషన్‌ దాఖలు చేసే తేదీ నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరి అభ్యర్థులు జనరల్‌ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు… సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అనర్హులు. నేరాలకు పాల్పడి శిక్ష పడిన వారు, శిక్ష పూర్తిగా అనుభవించిన తర్వాత ఐదేళ్లు పూర్తి కాని వారు అనర్హులు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు, మతిస్థిమితం లేనివారు, బధిరులు, మూగవారు, దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు అనర్హులు. అలాగే రుణ విమోచన పొందని దివాలాదారు, గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వ్యక్తులు, చెల్లింపునకు నోటీసు ఇచ్చినా గడువులోగా బకాయి చెల్లించని వారు గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అనర్హులని చెప్పింది ఎన్నికల సంఘం.