
నిర్మల్ జిల్లా : 2013లో బాసర సరస్వతి అమ్మవారి బంగారు కిరీటంలోని నవరత్నాల్లో కెంపు గల్లంతు వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. కెంపు గల్లంతు వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెల్సుకుని… నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ కి ఆదేశం ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
2006లో అమ్మవారికి నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహంపైన ఉన్న కిరీటం.. ధగధగమెరిసిపోయేది. ఆ కిరీటంలో ఒక కెంపు కనిపించడంలేదు. దీంతో.. భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఏళ్లుగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి చేయడం లేదని… ఆభరణాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు.
ఐతే… కిరీటం నుంచి కెంపు రాలిపోయిందని.. దీనిని తామే భద్రపరిచామని ఆలయ పూజారులు, అధికారులు చెప్పారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో.. ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించి.. విచారణకు ఆదేశించింది.