హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్)పెరిగిందని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ నవీన్ న తెలిపారు. గత విద్యాసంవత్సరంలో 19.45 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19.66 లక్షలకు చేరిందని, గతేడాదితో పోలిస్తే సుమారు 21 వేల మంది పెరిగారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల వల్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగిందన్నారు. అన్నా–అక్క మెంటర్‌షిప్, ఏఐ తరగతులు, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం, ఇన్‌స్పెక్షన్ బృందాల ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 3+2 నమూనా విద్యా విధానాన్ని పరిశీలిస్తున్నట్లు యోగితా రాణా తెలిపారు. దీని ప్రకారం తొలి మూడు సంవత్సరాలు రాష్ట్రంలోని కళాశాలల్లో, చివరి రెండేళ్లు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశాన్ని కల్పించే దిశగా కసరత్తు జరుగుతోందన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించామని, పీజీఐ ర్యాంకింగ్‌లో తెలంగాణ 31వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు.
