జూన్ 1 నుంచి పర్యావరణ గ్రామసభలు..జూన్15 వరకు ప్రతి పంచాయతీలో నిర్వహణ

జూన్ 1 నుంచి పర్యావరణ గ్రామసభలు..జూన్15 వరకు ప్రతి పంచాయతీలో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(జూన్ 5 ) పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది.  సభల నిర్వహణ, షెడ్యూల్, ఫొటోల అప్‌‌‌‌‌‌‌‌లోడ్ వంటి అంశాలపై  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) విడుదల చేసింది. ఈ కార్యక్రమాలన్నింటినీ ‘పంచాయతీ నిర్ణయ్’ మొబైల్ యాప్ ద్వారానే పర్యవేక్షించనున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ మొబైల్స్‌‌‌‌‌‌‌‌లో ‘పంచాయతీ నిర్ణయ్’ యాప్ లేటెస్ట్ వర్షన్  డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ-గ్రామ్ స్వరాజ్ క్రెడెన్షియల్స్‌‌‌‌‌‌‌‌తో లాగినై , గ్రామ సభ జరిగే వేదిక పంచాయతీ భవనం లేదా కమ్యూనిటీ హాల్ ఫొటోను ముందుగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలి.

రేపటి నుంచి జూన్ 15వ తేదీ మధ్యలో ఏదో ఒకరోజు గ్రామసభ నిర్వహించేలా షెడ్యూల్ చేసుకోవాలి. పర్యావరణ దినోత్సవ సభల్లో ప్రధానంగా ఆరు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్ఓపీలో పేర్కొన్నారు. గ్రామ సభకు ఎంతమంది హాజరయ్యారనే వివరాలను లింగాల వారీగా (పురుషులు, మహిళలు) యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలి. సభలో నిర్వహించిన ఒక్కో యాక్టివిటీకి సంబంధించిన ఫొటోలను కూడా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నమోదు చేసిన వివరాల్లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించారు.