V6 News

ఇన్నేళ్లుగా నన్నెవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే గుర్తించారు

ఇన్నేళ్లుగా నన్నెవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే గుర్తించారు

వరంగల్ రురల్ జిల్లా: గ్రామాలు బాగుపడాలనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఊర్ల అభివృద్ధి కోసం యువకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారాయన. వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతిని ప్రారంభించారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎవరూ గుర్తించలేదని అన్నారు. ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే తనను గుర్తించి మంత్రి పదవి ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యాయన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని గతంలో కాంగ్రెస్ నాయకులు అన్నారని గుర్తు చేశారు ఎర్రబెల్లి. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే 24 గంటల కరెంట్, ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేశారన్నారు.

దాతల సాయం తీసుకోవాలి

గ్రామాల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తే ఫైన్లు వేయాలని కార్యదర్శి, సర్పంచ్‌లకు సూచించారు ఎర్రబెల్లి. 12 లక్షలతో ప్రతి గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం తమదే అన్నారు. హరిత హారం కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళడుతున్నాయన్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కోసం యువత ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. దాతల సాయం తీసుకోని డెవలప్ చేసుకోవాలని చెప్పారు మంత్రి.