జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. జైలుకు తరలింపు

జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. జైలుకు తరలింపు

ఈఎస్ఐ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న‌ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయ‌న‌ను బుధ‌వారం సాయంత్రం అంబులెన్స్‌లో విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు పోలీసులు. గ‌త ప్ర‌భుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు, టెలీ స‌ర్వీసెస్‌లో వంద‌ల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని విజిలెన్స్ రిపోర్టు ఇవ్వ‌డంతో ఏసీబీ రంగంలోకి దిగి ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో గ‌త ప్ర‌భుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత అచ్చెన్నాయుడిని గ‌త నెల‌లో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసే నాటికి రెండ్రోజుల ముందే ఆయ‌న పైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఉండ‌డంతో శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు సుదీర్ఘ ప్ర‌యాణం వ‌ల్ల గాయం తీవ్ర‌మైంది. దీంతో ఆయ‌న‌కు 14 రోజుల‌ జుడిషియ‌ల్ రిమాండ్ విధించిన కోర్టు మెరుగైన వైద్యం అందించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. గుంటూరు జీజీహెచ్‌లో ఆయ‌న్ను అడ్మిట్ చేశారు. అక్క‌డ ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు.. మ‌రోసారి ఆప‌రేష‌న్ చేశారు. ఆయ‌న‌ను గ‌త వారం కోర్టు ఏసీబీ క‌స్ట‌డీకి ఇవ్వ‌డంతో ఆస్ప‌త్రిలోనే ఉంచి మూడ్రోజుల పాటు విచారించారు. అయితే ఆయ‌న జుడిషియ‌ల్ రిమాండ్ ముగియ‌డంతో కోర్టు జూలై 10 వ‌ర‌కు రిమాండ్ పొడిగించింది.

అచ్చెన్నాయుడికి జీజీహెచ్‌లో వైద్యం స‌రిగా అంద‌డం లేద‌ని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని కొద్ది రోజులుగా టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌డ‌న్‌గా ఆయ‌న్ని జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న్ని విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో అడ్డుకునేందుకు గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆస్పత్రిలో నుంచి ఆయ‌న్ని వీల్ చైర్‌లో తీసుకొచ్చి అంబులెన్స్‌లో ఎక్కించారు పోలీసులు. ఈ స‌మ‌యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ అంబులెన్స్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆస్ప‌త్రి వ‌ద్ద భారీగా మోహ‌రించిన పోలీసులు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను నియంత్రించి.. అచ్చెన్నాయుడిని విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు. కాగా, జైలులో ఆయ‌న‌కు ఖైది నెంబర్ 1573ని కేటాయించారు.