భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన "తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం" భూమిలేని నిరుపేదల కోసం "భూదానోద్యమం" లాంటి గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు గడుస్తున్నా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. భూసంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం 2018 లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుల ప్రక్షాళన ఎల్ ఆర్ యు పి (ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రాం) తో మొదలుపెట్టి పాత చట్టాలను రద్దుచేసి కొత్త రెవెన్యూ చట్టం 2020 తెచ్చింది. అప్పటి వరకు సిసిఎల్ఏ పర్యవేక్షణలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో భూ రికార్డులు అందుబాటులో ఉండేవి.
ఆ తదనంతరం ఎన్ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థ, టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్ సి ఎల్ లాంటి ఐటీ కంపెనీలను కాదని దివాళా తీసిన సత్యం కంప్యూటర్స్ అనుబంధ కంపెనీలు ఐఎల్ & ఎఫ్ఎస్, టెరాసిస్ కంపెనీలకు ధరణి పోర్టల్ బాధ్యతలను అప్పగించారు. అప్పటివరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఒకే దగ్గర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నవాటిని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ఎమ్మార్వో కార్యాలయంలో జరిగేలా కొత్త వ్యవస్థ ఏర్పాటు జరిగింది. రికార్డుల ప్రక్షాళనలో బాగంగా దొర్లిన అనేక తప్పులు కబ్జా కాలం ఎత్తేసి (పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదవడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు) లాంటివి అనేక తప్పుల తడకలా 33 మ్యాడ్యూల్లతో ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉండేది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా నాలా కన్వర్షన్, భూమి రిజిస్ట్రేషన్ అవ్వగానే మ్యుటేషన్‌తో వారం రోజుల లోపల పాస్ బుక్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి తలుపు తట్టేది.
సర్వే మ్యాప్
పక్కరాష్ట్రం కర్నాటకలో అమలవుతున్న "రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి" అనే నిబంధన ప్రస్తుతం ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా మొదటి ఎకరం రిజిస్ట్రేషన్ జరిగింది అని ప్రభుత్వం చెపుతోంది. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో పక్కన నలుదిక్కులలో ఉన్న ఏ ఒక్క రైతు అయినా పంచనామా సందర్భంలో అభ్యంతరం తెలిపితే ఒక్క ఎకరం కూడా రిజిస్ట్రేషన్ జరగదు. ఈ నిబంధన కేవలం భూముల అమ్మకాలు కొనుగోళ్ల సందర్భంలో మాత్రమే పని చేస్తుంది. దీనితో గెట్టు సమస్య పరిష్కారం అవ్వకపోగా ఆ సర్వేనెంబర్ లో ఉన్న రైతుల భూములకు కూడా భూ సర్వే ( ఎంజాయ్మెంట్ సర్వే ) తప్పనిసరిగా మారుతుంది. దీనికంటే ఒక గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సమగ్ర భూ సర్వే చేస్తే అమ్మకం కొనుగోలు భూముల మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల రికార్డులు, మ్యాపులు అప్డేట్ అయ్యి సమగ్ర భూ సర్వేనే సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది.
పేరుగొప్ప..
ఆర్వోఆర్ 2020 చట్టం ధరణి పోర్టల్ లో లోపాల కారణంగానే ఆర్వోఆర్ చట్టం 2025 భూభారతి పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. కొత్త చట్టంలో సాదా బైనామ క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి, మనిషికి ఆధార్ కార్డుల భూమికి భూ ఆధార్ కార్డు జారీ, ఆపిల్ వ్యవస్థ, రెవెన్యూ ట్రిబ్యునల్ల ఏర్పాటు, గ్రామకంఠం భూముల సర్వే, డిజిటల్ ల్యాండ్ సర్వే అంశాలు పొందుపరచారు. కానీ "కొత్త సీసాలో పాత సారా" అన్నట్టు ధరణి పోర్టల్ లో అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను ఎలాంటి ప్రక్షాళన చేయలేదు. ప్రజాపాలన, రెవెన్యూ సదస్సుల పేరుతో అప్లికేషన్లు స్వీకరించి తిరస్కరించారు. ప్రభుత్వం ఒకవైపు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి తెచ్చి ఇంకోవైపు మీసేవ ధరణి/భూభారతి ఆపరేటర్లు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ఏఐ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ద్వారా పట్టాదారులకు తెలియకుండానే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి సంతకాలు ఫోర్జరీ చేసి భూములు పట్టాలుగా మారుతున్నాయని ఇటీవల ఓ వార్త పత్రికల్లో వచ్చింది. భూభారతి పోర్టల్ కూడా లోపభూయిష్టంగా మారిందా అని అనుమానం వస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచినా భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా, రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది. ధరణి పోర్టల్ ద్వారా లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని గతంలో నే తేలింది. కానీ ఫోరెన్సిక్ ఆడిట్ అంటూ కాలయాపన తప్ప ఇప్పటివరకు ఒక్క ఎకరం రికవరీ అయినట్లు కూడా తెలియడంలేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, చట్టాలు, పోర్టళ్లు మారుతున్నాయి తప్ప రైతుల భూములకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దయచేసి ప్రజాప్రభుత్వం భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని గమనించాలి.
భూభారతి
ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులకు గురైన రైతులకు మేం అధికారంలోకి రాగానే భూభారతి పోర్టల్ తో న్యాయం చేస్తాం అని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టం - 2020 స్థానంలో ఆర్వోఆర్ చట్టం - 2025, ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసి (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) కు అప్పజెప్పింది. ధరణి పోర్టల్ లో ఉన్న 33 మ్యాడ్యూళ్లు భూభారతిలో 15 అయ్యాయి. భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా సాదా బైనామా సమస్యలు రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. భూభారతి చట్టంలో సెక్షన్ 6 రూల్ 6 కింద రెగ్యులర్ చేయాలని ఉన్నా అధికారుల అవగాహనలేమి నిబంధనలతో సమస్య పరిష్కారం కావడం లేదు.తొమ్మిది లక్షల అప్లికేషన్లలో ఇప్పటివరకు పరిష్కారం చేయబడ్డవి వెయ్యి కూడా లేవు.
- బందెల సురేందర్ రెడ్డి
మాజీ సైనికుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
