ఉన్నతాధికారులు పట్టించుకుంటలే

ఉన్నతాధికారులు పట్టించుకుంటలే
  • సమస్య ఉన్నచోట కనీసం శాంపిల్స్​ సేకరించట్లే
  • వానా కాలం జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న నల్లా నీరు కలుషితమై వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నా అధికారులకు పట్టట్లేదు. పదే పదే సమస్య పునరావృతం అవుతున్నా లైట్​తీసుకుంటున్నారు. సిటీలోని చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నామని డైలీ ట్విట్టర్ ద్వారా జనం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వాటర్​బోర్డు, మంత్రి కేటీఆర్​ను ట్యాగ్​చేస్తూ రంగు మారిన, మురుగు, నురగలు కక్కుతూ సరఫరా అయిన నీటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.10 నుంచి 20 రోజులుగా ఇదే సమస్య కొనసాగుతున్నా ఎవరూ స్పందించడం లేదని పేర్కొంటున్నారు.చేసేదేం లేక వానా కాలంలోనూ మంచినీటిని కొనుక్కొని తాగుతున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు వానా కాలంలో తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నా వాటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుల్ షిఫా, బోడుప్పల్, జంగంమెట్, ముషీరాబాద్, బాకారాం, బౌద్ధనగర్, వారసిగూడ, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో10 నుంచి 20 రోజులుగా తీవ్రమైన కలుషిత సమస్య ఉంది. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నామని ఫిర్యాదులు వస్తున్నా కనీసం నీటి శ్యాంపిల్స్​ను సేకరించి టెస్టులకు పంపడం లేదు.

సమస్య గుర్తించేందుకే నెలలు

వాటర్​బోర్డు పరిధిలో ఎన్నో ఏండ్ల నాటి పైపులైన్లే లీకేజీలకు కారణం. దాదాపు వీటి ద్వారానే కలుషిత నీరు సరఫరా అవుతోంది. అయితే సమస్య తలెత్తిన ప్రతిసారి ఎక్కడ లీక్​లీక్ అవుతోందో గుర్తించడానికి అధికారులకు నెలలు టైం పడుతోంది. ఈలోపు కలుషిత సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇటీవల లంగర్ హౌజ్ లో ఇదే జరిగింది. 2 నెలలు పాటు మురుగు కలిసిన నీరు సరఫరా అయినా అధికారులు గుర్తించలేకపోయారు. చివరికి ఒకచోట లీకేజీని గుర్తించడంతో సమస్య తీరింది. గతంలో భోలక్​పూర్ లోనూ ఇలాగే జరిగింది. పైపులైన్లు పాతకాలం నాటివి ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే చాలావరకు సమస్య రాదు. కానీ ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో వీటిని పట్టించుకోవడం లేదు. కలుషిత నీటి సమస్యతో చాలా మంది వానా కాలంలోనూ మంచినీటిని కొనుక్కొని తాగుతున్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి ఉంది. వేసవిలో నీటి కొరత వల్ల, ఇప్పుడేమో కలుషితం సమస్యతో జనం నీళ్లు కొనుక్కుని తాగడం కామన్​అయిపోతోంది.

ఉన్నతాధికారులు పట్టించుకుంటలే....

నీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించకపోవడంతోనే సమస్య తీవ్రమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో కూర్చోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఫీల్డ్​లోకి వస్తే తప్ప పనులు కానీ పరిస్థితి నెలకొంది. 

20 రోజులుగా కలుషిత నీళ్లే

20 రోజుల నుంచి మా ఏరియాలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ట్యాప్ బంద్​చేసినా అందులోంచి బొట్టుబొట్టుగా వస్తున్న కలుషిత నీటితో ఇళ్లంతా దుర్వాసన వస్తోంది. కలుషిత నీటిని తాగి ఇప్పటికే కుటుంబం మొత్తం ఆస్పత్రుల పాలైనం. వాంతులు, విరేచాలు, కడుపునొప్పితో బాధపడుతున్నం. అధికారులు సమస్య లేకుండా మంచినీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలె.  
- విజయకుమారి, ద్వారకానగర్, బోడుప్పల్

కాచి చల్లార్చి తాగితే మంచిది

మంచినీటి విషయంలో వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలె. ఎక్కడైనా పైపులు లీక్ ఉంటే కలుషితం అయ్యే చాన్స్​ఉంది. వాటిని తాగితే డయేరియా, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడొచ్చు. చాలా వరకు కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది. ప్రత్యేకంగా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం.
- డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్