ఈటల ఓ నీటి చుక్క మాత్రమే.. నష్టమేం లేదు

ఈటల ఓ నీటి చుక్క మాత్రమే.. నష్టమేం లేదు
  • హుజూరాబాద్ లో ఏ ఎన్నికలైనా.. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ బొమ్మతోనే గెలిచాం
  • సాగర్ లో జానారెడ్డి లాండి ఉద్దండుడే కేసీఆర్ బొమ్మ ముందు నిలువలేకపోయిండు 
  • ఈటలపై పార్టీ పరంగా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు
  • కేసీఆర్, కేటీఆర్ లతో అందరం చర్చించాకే నిర్ణయం
  • రాష్ట్రంలో మరో పదేళ్లు కేసీఆర్ శక్తి ముందు మరే శక్తి పనిచేయదు –మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీటి బిందువు లాంటి వ్యక్తి మాత్రమే.. ఆయన పార్టీ నుండి వెళ్లి పోతే నష్టమేం లేదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇంత వరకు హుజూరాబాద్ లో ఏ ఎన్నికలైనా.. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ బొమ్మతోనే గెలిచాం.. నేను కూడా కేసీఆర్ బొమ్మవల్లే గెలవగలిగానని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి లాండి ఉద్దండుడే కేసీఆర్ బొమ్మ ముందు నిలువలేకపోయిండు.. హుజూరాబాద్ లో కూడా అంతే.. కేసీఆర్ బొమ్మతోనే గెలుపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈటల.. పుట్టమధుల వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ తొలిసారిగా స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈటలపై పార్టీ పరంగా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా.. చట్ట ప్రకారం ముందుకెళ్లడం జరిగిందన్నారు. ఈటల వ్యవహారంపై ఏం చేయాలనేది కేసీఆర్, కేటీఆర్ లతో అందరం చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. 
హుజూరాబాద్ లో ఎవరిని నిలబెట్టినా కేసీఆర్ బొమ్మతో ఖచ్చితంగా గెలుస్తాం
హుజరాబాద్ లో మా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టినా మా కేసీఆర్ బొమ్మతో కచ్చితంగా గెలుస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇక్కడ నేను గెలిచినా.. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచినా.. మేము మా సొంత బలంతో గెలవలేదన్నారు. కేవలం కేసీఆర్ బొమ్మను చూసి, 24 గంటల కరెంటు చూసి, కాళేశ్వరం జనాలను చూసి ప్రజలు ఓటు వేస్తున్నారని మంత్రి గంగుల అన్నారు. హుజరాబాద్ లో మా పార్టీ బలంగా ఉంది‌, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ గెవడం ఖాయమన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో మా పార్టీ కేడర్ ఎవరు అధైర్యపడంలేదని, ఆగమాగం అంతకంటే లేదన్నారు. పార్టీ నాయకులందరూ మమ్మల్ని ఎవరు బెదిరించినా బెదరమని, టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నామని చెబుతున్నారని మంత్రి గంగుల వివరించారు. 
80శాతం సామాన్య ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉన్నారు
రాష్ట్రంలో 80 శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని మంత్రి గంగుల అభిప్రాయపడ్డారు. రాజకీయ ఉద్దండులు అన్న జానారెడ్డి నాగార్జున సాగర్ లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదని, కేవలం కెసిఆర్ బొమ్మ ముందు ఆయన నిలువ లేకపోయారని మంత్రి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ పై ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పరమైన చర్యలు మాత్రమే జరిగాయని, ఆయనపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
పుట్ట మధు వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం లేదు
న్యాయవాద దంపతుల హత్యతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఎంత మాత్రం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ విషయంలో హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుందన్నారు. హతుడు వామన్ రావు తండ్రి పుట్టమధు పై ఎంక్వైరీ చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం ఉండదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. మా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతోందన్నారు. ప్రభుత్వం మీద సాధారణంగా వ్యతిరేకత ఉంటుంది,  కానీ మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు అటు తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయాలు సాధించిందని మంత్రి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు పది జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారన్నారు. నాగార్జునసాగర్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా కేసీఆర్ బొమ్మను చూసి ఓటేశారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలంతా వన్ సైడ్ టిఆర్ఎస్ పట్ల మొగ్గు చూపారని మంత్రి పేర్కొన్నారు. అంటే అటు పల్లెల్లో, ఇటు పట్టణాల్లో అంతటా టిఆర్ఎస్ పట్ల ప్రజలు అభిమానం చూపిస్తున్నారని, మరో పదేళ్ల వరకు కేసీఆర్ శక్తి ముందు మరో శక్తి ఏది పనిచేయదని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.