ఇరాన్ పై అమెరికా మిలటరీ దాడికి ముహూర్తం ఖరారైందా? రేపుమాపో భీకరదాడులు చేయనుందా? ఇరాన్ కు పదిరోజుల గడువుకు ఇచ్చినా అమెరికా.. డెడ్ లైన్ కంటే ముందే దాడి కి సిద్దమవుతుందా? ఇప్పటికే యుద్దంపై తుది నిర్ణయం తీసుకుందా? అంటే తాజా పరిస్థితులు అవుననే చెబుతున్నాయి.
మరికొద్ది గంటల్లో అంటే సోమవారం లేదా మంగళవారం ఇరాన్ పై అమెరికా మిలిటరీ దాడులకు దిగుతుందని మాజీ CIA అధికారి జాన్ కిరియాకౌ చెప్పడం ఏక్షణాన్నైనా యుద్దం మొదలవొచ్చన్న ప్రచారం మరింత బలపడింది. అమెరికా డిమాండ్లను ఒప్పుకునేందుకు ఇరాన్ కు ఇచ్చిన 10 రోజుల గడువు ఓ వ్యూహాత్మక ప్రకటన మాత్రమేనని, ఇరాన్ డిమాండ్లను ఆమోదించేందుకు పదిరోజలు గడువిచ్చారని, గడువు ముగియకముందే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించే అవకాశం ఉందని కిరియాకౌ చెప్పడం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్ కూడా యుద్దానికి సై అంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.పదేళ్ల తర్వాత ఇరాన్ తొలిసారి వైమానిక రక్షణ క్షిపణి సయ్యద్ 3G ని పరీక్షించింది. హర్ముజ్ జలసంధిలో స్మార్ట్ కంట్రోల్ విన్యాసాల్లో ఇరాన్, రష్యా సైన్యం సంయుక్తంగా క్షిపణిని ప్రయోగించిన వీడియోలను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసింది. 900కిలోల బరువున్న సయ్యద్ 3G క్షిపణీ 150 కిలోమీటర్ల దూరంలో శత్రు యుద్ద విమానాలను ఛేదించగలదు. ఫిబ్రవరి 19 నుంచి హార్ముజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్ ఓడరేవులో రష్యా, ఇరాన్ ఉమ్మడి నావికా విన్యాసాలు జరుగుతున్నాయి. యుద్ద నౌకలు హైజాక్ అయితే రక్షించే రిహార్సల్స్ నిర్వహించాయి.
ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ లో మోహరించిన దాదాపు 40వేల మంది అమెరికా సైనికులు ఇరాన్ క్షిపణి వ్యవస్థలకు టార్గెట్ గా మారవచ్చని భయపడుతోంది. జూన్ 2025లో జరిగిన దాడికంటే భిన్నంగా ఇరాన్ ఈసారి వ్యూహాత్మక దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరికల క్రమంలో అమెరికా తన మిలిటరీ బలగాలను వ్యూహాత్మకంగా మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరిస్తోంది. ఇరాన్ క్షిపణి వ్యవస్థ లక్ష్యానికి దూరంగా యుద్ద నౌకలు, విమానాలు సేఫ్ పాయింట్లకు తరలించింది. జెరూసలేం పోస్ట్, బహ్రెయిన్, ఇరాక్, సిరియా, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని యుఎస్ సైట్‌లలో షిఫ్ట్‌లతో పాటు అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి వందలాది మంది సిబ్బందిని తరలించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదికలు చెబుతున్నాయి.
మిడిల్ ఈస్ట్‌లో వేగంగా పరిణామాలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా సైనిక మోహరింపు, వ్యూహాత్మక మార్పులు ఒకవైపు కొనసాగుతుండగా, ఇరాన్ కూడా తన రక్షణ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ అప్రమత్తమవుతోంది. అమెరికా, ఇరాన్ చర్చలు ఫలిస్తాయా లేక మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ద జ్వాలలు చిక్కుకుంటుందా అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
