ఎక్సైజ్ యాక్ట్11వ ఎడిషన్ బుక్ రిలీజ్

ఎక్సైజ్ యాక్ట్11వ ఎడిషన్ బుక్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎక్సైజ్ యాక్ట్ 11వ ఎడిషన్ పుస్తకాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ శుక్రవారం ఆవిష్కరించారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసియా లా బుక్ హౌజ్ ప్రచురించిన  కొత్త పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. గతంలో 2021లో ఎక్సైజ్ యాక్ట్ బుక్ ప్రింట్ కాగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత అన్ని అప్‌డేట్స్‌తో ఈ11వ ఎడిషన్‌ను తీసుకొచ్చారు.

2026 జనవరి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, సవరణలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఏసియా లా బుక్ పబ్లిషర్ సునీల్ గోష్, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, లా బుక్ హౌజ్ ప్రతినిధి సుదర్శన్ సింగ్, అసిస్టెంట్ కమిషనర్ శీలం శ్రీనివాస్, ఏఈఎస్ జీవన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

సౌమ్యకు ఘన నివాళి.. 

నేరస్తులను పట్టుకునే క్రమంలో ప్రాణత్యాగం చేసిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి శాఖ గౌరవాన్ని పెంచడమే కాకుండా, తోటి ఉద్యోగుల్లో ఆమె స్ఫూర్తి నింపిందని కొనియాడింది.

ప్రమాదం జరిగిన రోజు నుంచి ఆస్పత్రిలో సౌమ్య చివరి శ్వాస విడిచే వరకు అండగా ఉన్న నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి, ఈఎస్ మల్లారెడ్డి, సీఐ స్వప్నకు అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఆమె కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఎక్సైజ్ ఉద్యోగికి పేరుపేరునా కృతజ్ఞతలు ప్రకటించింది.

సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించడంపై అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ హరికిరణ్, అడిషనల్ కమిషనర్ ఖురేషీలకు ధన్యవాదాలు తెలిపింది.