మావోయిస్టు పార్టీ కొత్త చీఫ్ ఎవరు..? తెరపైకి ఇద్దరి కీలక నేతల పేర్లు

మావోయిస్టు పార్టీ కొత్త చీఫ్ ఎవరు..? తెరపైకి ఇద్దరి కీలక నేతల పేర్లు

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి తర్వాత ఆ పార్టీ కొత్త చీఫ్ ఎవరనే చర్చ మొదలైంది.  అత్యున్నత హోదాలో ఉన్న ఆయన ఎన్ కౌంటర్‎లో మృతి చెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. కొత్త ప్రధాన కార్యదర్శగా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్‌ సోను పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ రెండు పేర్లపై ప్రధానంగా  ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. తిరుపతి మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నారు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు.

 వీరిలో తిరుపతి మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వేణుగోపాలరావు బ్రాహ్మణ వర్గానికి  చెందిన వారు. పాత తరం నాయకుల్లో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తిరుపతికి 62 ఏళ్లు కాగా.. వేణుగోపాలరావుకు 70 సంవత్సరాల వయస్సు.  వీరిద్దరూ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. మావోయిస్టులు సాయుధ విభాగం నాయకుడికి పట్టం కడతారా..?  సైద్ధాంతిక విభాగం నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తారా? అనే చర్చ ఇంటెలిజెన్స్ వర్గాల్లో నడుస్తోంది.