లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపుల్లేవ్

లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపుల్లేవ్
  • పార్లమెంటరీ ప్రివిలేజ్​తో అవినీతిని కప్పేయలేరు: సుప్రీంకోర్టు
  • ఓటేయడానికి ప్రతిఫలం తీసుకుంటే విచారించాల్సిందే
  • లంచాలు తీసుకుని ప్రసంగిస్తే నేరమేనని కామెంట్
  • ప్రజాస్వామ్య పునాదులను అవినీతి దెబ్బతీస్తుందని ఆగ్రహం
  • సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
  • 1998 పీవీ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును తోసిపుచ్చిన బెంచ్

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలు.. సభలో తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి, సభలో ప్రసంగించేందుకు లంచం తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ విషయంలో పార్లమెంటరీ ప్రివిలేజ్ వారికి రక్షణ కల్పించలేదని స్పష్టం చేసింది. లంచాల కేసుల్లో ప్రజాప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఎందుకు ఉండాలి? అని ఏడుగురు జడ్జిల ధర్మాసనం ప్రశ్నించింది.

 1998లో పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో ఐదుగురు జడ్జిల తీర్పును.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. చట్టసభ్యులు అవినీతికి పాల్పడటం, లంచాలు తీసుకోవడం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రజా జీవితంలో ఇవి రెండూ నిస్సహాయతను దెబ్బతీస్తాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.

 1998 నాటి ఐదుగురు జడ్జిల ధర్మాసనం తీర్పు వివరణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 194కు విరుద్ధమని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ రెండు ఆర్టికల్స్ పార్లమెంట్, అసెంబ్లీల్లో చట్ట సభ్యుల అధికారాలను మాత్రమే తెలియజేస్తాయన్నారు. అవినీతి, లంచం అనేవి రాజ్యాంగ ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. లంచం ఆరోపణలు కూడా.. విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉందన్నారు. 

చట్టసభ అధికారులు గుర్తు పెట్టుకోవాలి

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద విచారణ చేయొచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చట్టసభ అధికారాల ఉద్దేశ్యం, లక్ష్యాలను సభ్యులందరూ గుర్తు పెట్టుకోవాలని నొక్కి చెప్పారు. ‘‘1998లో పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో ఇచ్చిన‌‌ తీర్పు మేర‌‌కు.. లంచం తీసుకుని ఓటు వేసే సభ్యుడికి రక్షణ లభిస్తున్నది. ఎవ‌‌రైనా స‌‌భ్యుడు లంచం తీసుకుంటూ ప‌‌ట్టుబ‌‌డితే.. అలాంటి వారికి ఇకపై ఎలాంటి రక్షణ ఉండదు. లంచం అనేది ఏ రూపంలో తీసుకున్నా.. అది నేరమే అవుతుంది. మేము ఈ వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై స్వతంత్రంగా తీర్పు ఇచ్చాం’’అని సీజేఐ చెప్పారు. 1998 నాటి మెజార్టీ తీర్పు.. ప్రజా ప్రయోజనం, విశ్వసనీయత దెబ్బతీసేలా ఉందన్నారు. లంచం తీసుకుని సమస్యపై మాట్లాడటం, ప్రశ్నలు అడగడం సరికాదని చెప్పారు.

ఇప్పుడెందుకు చర్చనీయాంశమైంది?

2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతా సోరెన్‌‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకుని.. మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై సీబీఐ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసింది. ఈ క్రిమినల్‌‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ముందుగా జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్‌‌ సుప్రీంకు వెళ్లారు.

 ఈ పిటిషన్​పై 2019లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం విచారణ జరిపింది. ఆపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి  ఈ కేసును సిఫార్సు చేసింది. కాగా, జేఎంఎం ఎమ్మెల్యే లంచం కేసులో సుప్రీం తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అయితే, ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉండాల్సిందని పేర్కొంది. చాలా ఏండ్లు ఈ కేసు పెండింగ్​లో ఉందని అభిషేక్ సింఘ్వి అన్నారు.

తీర్పును స్వాగతిస్తున్నాం: మోదీ

సుప్రీం కోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నట్టు వివరించారు. గౌరవప్రదమైన సుప్రీం కోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలకు భరోసా ఇ స్తుందని చెప్పారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పీవీ నరసింహా రావు వర్సెస్ సీబీఐ కేసు ఏంటి?

1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నది. ఆ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎంపీగా ఉన్న శిబు సోరెన్‌‌ సహా అదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో పీవీ సర్కార్ గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్‌‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. దీన్ని విచారించిన ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎంపీలకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో తీర్పు వెలువరించింది.