కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ కొట్టిపారేశారు. టీఎంసీ 226కుపైగా స్థానాలను గెలుచుకుని ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో గురువారం పార్టీ కార్యకర్తలను ఆమె అప్రమత్తం చేశారు. మే 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పహారా కాయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ‘దీదీ’ ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘మనం ఐక్యంగా ఉండాలి. నేటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రతి ఒక్కరు నిఘా ఉంచాలి. అవసరమైతే నా సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో నేనే స్వయంగా పహారా కాస్తాను’’ అని మమత పేర్కొన్నారు. అభ్యర్థులు, సీనియర్ లీడర్లు మొత్తం 294 నియోజకవర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
పగటిపూట కార్యకర్తలు విధుల్లో ఉంటే, రాత్రి సమయాల్లో నాయకులు స్వయంగా బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు. ‘‘నిద్రపోకండి. మేల్కొని ఉండండి. ఉదయం తదుపరి బృందానికి బాధ్యతలు అప్పగించిన తర్వాతే విశ్రాంతి తీసుకోండి. నేను పహారా కాయగలిగినప్పుడు, మీరు ఎందుకు చేయలేరు?’’ అని ఆమె ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్స్ ఒక కుట్ర
టీవీ చానెళ్లలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని టీఎంసీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమేనని మమతా బెనర్జీ ఆరోపించారు.2016, 2021 ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలంగా వచ్చాయని, కానీ ఫలితాలు మరోలా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.
బీజేపీ తన ప్రచారాన్ని పెంచుకోవడానికి మీడియాను వాడుకుంటోందని, తాము 226 స్థానాల మార్కును దాటుతామని తెలిసే ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్లు తమ స్థానాలను వదిలి వెళ్లకూడదని హెచ్చరించారు.

