జలవిహార్ ఆర్వో ప్లాంట్లో పేలుడు

జలవిహార్ ఆర్వో ప్లాంట్లో పేలుడు
  • తునాతునకలైన పరికరాలు
  •  ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్ రోడ్​లోని​జలవిహార్​లో ఉన్న ఆర్వో ప్లాంట్​లో భారీ పేలుడు జరిగింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ప్లాంట్​లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ చోటుచేసుకోవడంతో అక్కడి పరికరాలు పూర్తిగా తునాతునకలయ్యాయి. ప్లాంట్ వద్ద పనిచేస్తున్న అప్పుల నాయుడు (45), అంజి (30), లక్ష్మణ్ (40)కు తీవ్ర గాయాలయ్యాయి.

వీరిలో అప్పలనాయుడు, అంజిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, లక్ష్మణ్​ను సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అప్పలనాయుడితోపాటు లక్ష్మణ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వేసవి కాలం కావడం వల్ల ఆర్వో ఫిల్టర్ కంప్రెషర్​లో హై ప్రెషర్ రివర్స్ ఏర్పడటం వల్లే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్, లేక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల అసలు కారణాలపై లోతైన విచారణ చేస్తున్నారు.