- రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై హౌతీల అటాక్
- షిప్ పై దాడి చేస్తే పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తాం: ట్రంప్ వార్నింగ్
- అమెరికా బెదిరింపులకు వెనక్కి తగ్గేదే లేదు: ఇరాన్ మంత్రి అరాఘ్చీ
అమెరికా, ఇరాన్ యుద్ధం ఎర్ర సముద్రాన్ని తాకింది. గురువారం ఇరాన్ మద్దతు ఇస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై బాంబుల వర్షం కురిపించారు.
కైరో: అమెరికా, ఇరాన్ యుద్ధం ఎర్ర సముద్రాన్ని తాకింది. గురువారం తెల్లవారుజామున ఇరాన్ మద్దతు ఇస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై బాంబుల వర్షం కురిపించారు. ‘ఎన్సెలియా’, ‘లైలా’ అనే 2 సౌదీ ట్యాంకర్లపై తామే అటాక్ చేసినట్లు హౌతీల సబ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. అటాక్ వల్ల షిప్పుల్లో మంటలు చెలరేగాయి. యెమెన్‌పై సౌదీ ఆంక్షలు, అలాగే రాజధాని సనా ఎయిర్‌పోర్టుపై రీసెంట్‌గా జరిగిన దాడులకు ప్రతీకారంగానే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో సౌదీ షిప్పింగ్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపాయి.
ఈ ఘటనపై యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) స్పందిస్తూ.. ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా మిలటరీ వరుసగా 12వ రోజు కూడా దాడులు కొనసాగించింది. ఇంకోవైపు దౌత్యపరమైన చర్చలు వర్కవుట్ కాకపోవడంతో ఈ వార్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో హౌతీలు జరిపిన అటాక్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగేలా కనిపిస్తోంది.
బెదిరింపులకు భయపడం: ఇరాన్ మంత్రి అరాఘ్చీ
అమెరికా హెచ్చరికలు, వరుస మిస్సైల్ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. టెహ్రాన్ ఎప్పుడూ ‘కంటికి కన్ను’ అనే రక్షణ సిద్ధాంతాన్ని అవలంబిస్తుందని తేల్చి చెప్పారు. అమెరికా తమపై ఎలాంటి చర్యలకు దిగినా, అదే స్థాయిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
పాకిస్తాన్, తుర్కియేల రాయబారం వృథా..
ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు పాకిస్తాన్‌లో ఇరాన్ ఇంటీరియర్ మినిస్టర్ ఎస్కందర్ మొమెని ప్రయత్నం వృథా అయినట్టుగానే అనిపిస్తోంది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ కూడా ఇరు దేశాల మధ్య శాంతియుత చర్చలు జరపాలని కోరారు. అలాగే సౌదీ ట్యాంకర్లపై దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు.
మిస్సైళ్లు, డ్రోన్ల వర్షం..
పశ్చిమ ఇరాన్‌లోని అహ్వాజ్, రామ్‌షిర్, అండిమేష్క్ సిటీలతో పాటు ఇరాక్ బార్డర్‌లోని షాలమ్‌చే పట్టణంలో అమెరికా మిస్సైల్ దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు చనిపోయారు. దీనికి రిటాలియేషన్‌గా ఇరాన్ గల్ఫ్ దేశాల పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లను టార్గెట్ చేసింది. గురువారం ఉదయం తమ వైపు వచ్చిన 3 మిస్సైళ్లు, 6 డ్రోన్లను కూల్చేశామని జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాల సైన్యం వెల్లడించింది.
బ్రిడ్జి, పవర్ ప్లాంట్‌లను ధ్వంసం చేస్తం: ట్రంప్
హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంపై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్అయ్యారు. జలసంధిలో ఇరాన్ ఏ ఒక్క షిప్‌పై దాడి చేసినా, వాళ్ల బ్రిడ్జిని లేదంటే పవర్ ప్లాంట్‌ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, పర్వతం అడుగున లోతుగా నిర్మిస్తున్న ఇరాన్ అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ సెంటర్‌పై కూడా యూఎస్ మిలటరీ త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.
