మాజీ సైనికుల భూములు ధరణి చెరలో!

మాజీ సైనికుల భూములు ధరణి చెరలో!
  • నిషేధిత జాబితాలో 2 లక్షల ఎకరాలు
  • ఫ్రీడమ్ ఫైటర్స్‌‌‌‌కు ఇచ్చినవీ ఈ జాబితాలోనే
  • అమ్ముకోలేక.. మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు
  • ధరణిలో అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేస్తున్న కలెక్టర్లు

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు వాళ్లు.. దేశ సరిహద్దుల్లో పహారా కాసిన సైనికులు వాళ్లు.. తమకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అమ్ముకోలేక, మ్యుటేషన్ చేసుకోలేక గోస పడుతున్నారు. ధరణి చెరలో చిక్కిన అసైన్డ్ ల్యాండ్స్‌‌‌‌ను విడిపించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దాదాపు 8 లక్షల ఎకరాలను ప్రభుత్వం ధరణి పోర్టల్‌‌‌‌లోని నిషేధిత ఆస్తుల లిస్టులో చేర్చడమే ఇందుకు కారణం. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులవే 2 లక్షల ఎకరాల దాకా ఉన్నట్లు అంచనా. వాటిని నిషేధిత జాబితా నుంచి తీసేయాలని కోరుతూ వారందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

రెడ్ మార్క్ పెట్టిన్రు
దేశానికి చేసిన సేవలను గుర్తించి మాజీ సైనికులకు, ఫ్రీడం ఫైటర్స్​కు గత ప్రభుత్వాలు అసైన్​ చేసిన భూములకు టీఆర్ఎస్ ​సర్కారు రెడ్ మార్క్ పెట్టింది. వారి భూములన్నింటినీ ధరణిలో నిషేధిత ఆస్తులుగా పేర్కొంది. వాటిని అమ్ముకోకుండా.. వారసులకు ఇచ్చుకోకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం ఎవరికైనా భూమిని అసైన్ చేస్తే.. పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు లబ్ధిదారులకే చెందుతాయని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. అయితే టీఆర్ఎస్​సర్కారు ఆ జీవోలను అమలు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు చెందిన 2 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశం కోసం పని చేసిన తమకు ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి ఇదేనా అని బాధిత మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే కొందరు భూములు అమ్ముకోగా.. వాటిని కొనుగోలు చేసిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

అప్లికేషన్లు రిజెక్ట్
అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ధరణి పోర్టల్‌‌లో మార్చి మూడో వారంలో ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం.. రైతుల నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రం ప్రాసెస్ చేయడం లేదు. కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించామని, అప్లికేషన్ పెట్టుకున్న వారం, పది రోజుల్లో ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తీసేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. కానీ నెలలైనా సమస్య పరిష్కారం కావట్లేదు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల అప్లికేషన్లను  విచారణ లేకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో పలువురు మాజీ సైనికులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ధరణిలో అప్లికేషన్ స్టేటస్ చూస్తే రిజెక్ట్ రావడంతో తహసీల్దార్లను సంప్రదిస్తున్నారు. కలెక్టర్ రిజెక్ట్ చేస్తే తాము ఏం చేయలేమని,  కలెక్టర్ రిపోర్ట్ అడిగితే మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల భూమి అని రిపోర్టు ఇచ్చే వాళ్లమని చెప్పి పంపిస్తున్నారు. ఫీల్డ్ లెవల్ లో ఎంక్వైరీ చేయించకుండా రిజెక్ట్ చేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైకోర్టు తీర్పును అమలు చేయట్లే.. 
మాజీ సైనికులకు అసైన్డ్ చేసిన పదేళ్ల తర్వాత ఆ భూములను ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీసేయాలని 2012లో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 307 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు పదేళ్ల తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ గా ఇచ్చుకోవచ్చు. ఇలాంటి అసైన్డ్ భూములు రెండు, మూడు దశాబ్దాలైనా ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఉంటున్నాయి.

50 ఏళ్ల తర్వాత నిషేధిత జాబితాలోకి.. 
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ఫ్రీడం ఫైటర్ మన్నె గోపాల్ రెడ్డికి పొలిటికల్ సఫరర్ కేటగిరీలో ప్రభుత్వం1962లో అదే గ్రామంలోని 86వ సర్వే నంబర్లో 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఆయనకు భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ బుక్‌‌ జారీ చేశారు. ప్రస్తుతం 94 ఏళ్లున్న గోపాల్ రెడ్డి ఇటీవల ఆ భూమిని తన కొడుకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళితే ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. భూమి ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత  ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడమేమిటని గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాబితాలో ఉన్నట్లు తెలియదు.. 
ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో 32 లక్షల ఎకరాల భూములు ఉండగా, ఇందులో అసైన్డ్ భూములే 22 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు 2 లక్షల ఎకరాల దాకా ఉన్నట్లు అంచనా. ఈ భూములకు ఎల్ఆర్ యూపీలో పట్టాదార్ పాస్ బుక్స్ మంజూరు కావడం, రైతు బంధు కూడా వస్తుండటంతో వారికి ఆ విషయం తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. చాలా మంది రైతులకు తమ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లే తెలియదని, రిజిస్ట్రేషన్‌‌కు వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకుంటున్నారని వరంగల్ అర్బన్ జిల్లా తహసీల్దార్ ఒకరు చెప్పారు.

అప్లికేషన్ రిజెక్ట్ చేశారు.. 
ఎక్స్ సర్వీస్  మన్ అయిన నా కొడుకుకు ప్రభుత్వం1983లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ (ప్రస్తుత సిద్దిపేట) జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లిలోని సర్వే నంబర్ 164/2లో 4.21 ఎకరాల భూమిని అసైన్​ చేసింది. ఈ భూమిని అసైన్​ చేసి పదేళ్లు దాటినందు వల్ల నిషేధిత భూముల లిస్టు నుంచి తీసేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ 1993లోనే ఆర్డర్ జారీ చేశారు. ఆ ఆర్డర్ ఇప్పటికీ అమలు కావడం లేదు. నా కొడుకు చనిపోవడంతో నా పేరు మీద కొత్త పాస్ బుక్ కూడా అసైన్డ్  ల్యాండ్ గానే ఇచ్చారు. ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి164/2 సర్వే నంబర్ ను తీసేయాలని ధరణిలో మార్చి 31న అప్లికేషన్(2100002233) పెట్టుకున్న. కలెక్టర్ నా అప్లికేషన్ ను రిజెక్ట్ చేశారు. 
‑ రావుల మధురమ్మ, తోటపల్లి, సిద్దిపేట 


నా బిడ్డ  పేరు మీద..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 30 ఏళ్లు పని చేసిన. నేను సర్వీసులో ఉండగానే 1995లో ఉమ్మడి వరంగల్ జిల్లా అశ్వరావుపల్లిలో మూడెకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. మానసిక సమస్యతో బాధపడుతున్న నా కూతురికి ఆసరాగా ఉంటుందని భూమిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళితే ఆ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. తహసీల్దార్, కలెక్టర్ చుట్టూ తిరిగి అనేక దరఖాస్తులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన. తర్వాత మ్యుటేషన్ చేసి, పాస్ బుక్ ఇవ్వాలని తహసీల్దార్ కు అప్లై చేస్తే ఏడాదైనా పాస్‌‌ బుక్ రాలేదు. ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తీసేయాలని ధరణిలో అప్లై చేస్తే తహసీల్దార్ తప్పుడు రిపోర్టుతో కలెక్టర్ రిజెక్ట్ చేశారు.  
- గట్ల రాజ్ కుమార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి

ప్రొహిబిటెడ్‌‌ లిస్టులో పెట్టిన్రు  
సంగారెడ్డి జిల్లా ఊట్ల గ్రామంలో ఎక్స్ సర్వీస్ మన్ ఎస్ ఎన్ రెడ్డికి ఐదెకరాల భూమిని 1977లో ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిని 2006లో మేం కొన్నాం. 2016లో మా సోదరి ధాత్రి చంద్రకళ పేరిట ఐదెకరాల్లో 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశాం. మా ఇద్దరి పేరిట ఉన్న భూములు ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులో చూపుతున్నాయి. ఆ లిస్టు నుంచి తీసేయాలని అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేశారు. 
- దండెం రామకృష్ణా రెడ్డి, సికింద్రాబాద్