నకిలీ బాబా అవతారం ఎత్తి..రూ.కోటి 30 లక్షలు గుంజిండు.. గుప్త నిధుల పేరుతో యువకుడి మోసాలు

నకిలీ బాబా అవతారం ఎత్తి..రూ.కోటి 30 లక్షలు గుంజిండు.. గుప్త నిధుల పేరుతో యువకుడి మోసాలు
  • గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడు నకిలీ బాబాగా మారి అమాయకులను బురిడీ కొట్టించాడు. గుప్తనిధులు తీసిస్తానంటూ మాయమాటలు చెప్పి రూ.1.03 కోట్లకు పైగా వసూలు చేసిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా పోలీస్ హెడ్‌‌క్వార్టర్స్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన దర్శనాల రాజ్‌‌కుమార్ తనకు దేవర వస్తుందని, మంత్రశక్తి ఉందంటూ గత మూడేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. 

ఈ మాటలు నమ్మిన ప్రజలు అతని వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పేవారు. ఈ క్రమంలో మంత్రశక్తి ద్వారా బంగారం తవ్విస్తానని నమ్మించి బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. తన బావ మహేందర్, స్నేహితులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్‌‌తో కలిసి పథకం ప్రకారం గుంతలు తవ్వించి, అందులో నకిలీ నాణేలు పెట్టిన కుండను చూపిస్తూ మోసం చేశాడు. ఆ కుండను 41 రోజులు పూజలు చేయాలని, ముందుగా తెరిస్తే ప్రమాదమని భయపెట్టి డబ్బులు తీసుకుని పారిపోయేవాడు. 

ఇలా ఇప్పటివరకు 26 మంది బాధితుల నుంచి రూ.కోటి 3 లక్షల 80 వేలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. నిందితులపై 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మోసపోయిన వారు ఎవరైనా ఉంటే జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నిందితుల వద్ద నుంచి షిఫ్ట్ డిజైర్ కారు, బైకు, 7 మొబైల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు, కుండలు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌‌రెడ్డి, సీఐలు శ్రావణ్, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు