బ్రాండెడ్ బేరింగ్స్ పేరిట భారీ మోసం.. 2 వేల నకిలీ ఉత్పత్తులు సీజ్

బ్రాండెడ్ బేరింగ్స్ పేరిట భారీ మోసం.. 2 వేల నకిలీ ఉత్పత్తులు సీజ్
  •     సికింద్రాబాద్​లో ముఠా గుట్టురట్టు    
  •     ముగ్గురు దుకాణదారులపై కేసు

పద్మారావునగర్, వెలుగు: అసలైన బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో నకిలీ బేరింగ్స్ విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝులిపించారు. ప్రముఖ బేరింగ్స్ తయారీ సంస్థ ఎస్​కేఎఫ్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్​లోని రాణిగంజ్ ప్రాంతంలో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాణిగంజ్​లోని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ టూల్ అండ్ బేరింగ్, గంజ్ కాంప్లెక్స్​లోని బేరింగ్ ఇంటర్నేషనల్, సికింద్రాబాద్​లోని ఏ టు జెడ్ మెషినరీ స్టోర్లలో సుమారు 1,987 నకిలీ బేరింగ్స్, వాటికి సంబంధించిన 2,780 నకిలీ ప్యాకింగ్ బాక్స్ షీట్లను సీజ్ చేశారు. నాణ్యత లేని ఉత్పత్తులను అసలైనవిగా నమ్మిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న సదరు దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాణ్యత లేని వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి అక్రమ వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.