డీజీ హత్య కేసు.. సహాయకుడి డైరీలో ఆసక్తికర విషయాలు

డీజీ హత్య కేసు.. సహాయకుడి డైరీలో ఆసక్తికర విషయాలు

జమ్ము కశ్మీర్ లో జరిగిన జైళ్ల శాఖ డీజీ హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న డీజీ ఇంటి సహాయకుడి డైరీని పోలీసులు గుర్తించారు. అతని డైరీలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని భవిష్యత్తు, ఇతర మాటలను బట్టి చూస్తే అతడు డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే.. యాసిర్ అహ్మద్ (36) గత ఆరు నెలలుగా డీజీ హేమంత్ లోహియా ఇంట్లో పనిచేస్తున్నాడు. అయితే యాసిర్ ప్రవర్తన వింతగా ఉండేదని, డిప్రెషన్ లో ఉన్నాడని ఓ అధికారి తెలిపారు. అతని డైరీలో హిందీ పాటలు ఉన్నాయని, అందులో ఒకటి నన్ను మర్చిపో అనే పేరుతో రాసి ఉందని చెప్పారు. వీటితో పాటు "డియర్ చావు... నా జీవితంలోకి రా... ప్రస్తుతం నేను నాకు నచ్చని జీవితం బతుకుతున్నాను" అని రాసి ఉండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు "ఈ జీవితం నాకు నచ్చట్లేదు.. జీవితం అంటే విషాదం మాత్రమే. ప్రేమ 0శాతం, టెన్షన్ 90 శాతం, బాధ 99 శాతం, ఫేక్ స్మైల్ 100 శాతం. ప్రస్తుతం నేను బతుకుతున్న జీవితంతో నాకే సమస్యా లేదు. కానీ ఇబ్బందంతా భవిష్యత్తు గురించే"నని అహ్మద్ తన డైరీలో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో అతను ఉగ్రవాది అన్నట్టుగా ఎలాంటి ఆనవాళ్లూ లేవని... అయినా అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి తన స్నేహితుడి ఇంట్లో ఆయన హత్యకు గురవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్ కుమార్ శరీరంపై కాలిన గాయాలు, కొంతుకోసిన అనవాళ్లు కనిపించాయి. తన సొంత ఇంటికి గత ఆరు నెలలుగా మరమ్మతులు జరుగుతుండగా జమ్మూశివారులోని తన స్నేహితుడి ఇంట్లో గత కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మూడురోజుల పర్యటన జరుగుతుండగా..  జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది.