ప్లాన్ ప్రకారమే సింగరేణిపై తప్పుడు రాతలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్లాన్ ప్రకారమే సింగరేణిపై తప్పుడు రాతలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్లాన్ ప్రకారమే కొందరు సింగరేణిపై తప్పుడు రాతలు రాస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క. సింగరేణి కార్మికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది రాతలతో రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారని అన్నారు. శనివారం (జనవరి 24) ప్రజాభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన భట్టీ.. కొంతమంది వ్యక్తులకు ఆస్తులు కట్టబెట్టడం కోసమే సింగరేణిపై తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. 

తప్పుడు రాతలతో సింగరేణి టెండర్లపై అనేక అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టీ. ఎవరి ప్రయోజనాల కోసమో తప్పుడు రాతలు రాస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల నుంచి సింగరేణి ఆస్తులను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. సింగరేణి 4 కోట్ల మందికి సంబంధించిన ఆస్తి అని అన్నారు.  ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీ దారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వ స్తున్నట్లు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. 

హరీశ్ రావు లేఖ రాయడం.. కిషన్ రెడ్డి ఎంక్వైరీ వేయిస్తామనటం మంచిదే అయ్యిందన్నారు. అందరి నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సింగరేణిపై కిషన్ రెడ్డి పరిశీలిస్తేనే నిజాలు బయటపడతాయన్నారు. పెట్టుబడులు, కట్టుకథలతో విషపు రాతలు రాస్తు్న్నారని మండిపడ్డారు. నిజాలు బ యటకు రావాలి.. వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆకాంక్షించారు. 

2018లో కేంద్ర ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు చెప్పిన భట్టీ.. సైట్ విజిట్ తప్పనిసరి అని కోలిండియా టెండర్ డాక్యుమెంట్ లోనే ఉందన్నారు. 2021 లో సెంట్రల్ మైనింగ్ కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని చెప్పినట్లు గుర్తు చేశారు. టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. 

పత్రికలు, నాయకులే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచిందని.. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.