స్టూడెంట్ సాయిరాజ్ ఇంటి వైపు తొంగిచూడని ఆఫీసర్లు, నేతలు
కామారెడ్డి/బీర్కూర్, వెలుగు: గవర్నమెంట్ హాస్టల్ లో పాము కరిచి చనిపోయిన స్టూడెంట్ సాయిరాజ్ కుటుంబం ఇంటివైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కన్నెత్తి చూడటంలేదు. హాస్టల్ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో హాస్టల్లోనే తమ కొడుకు చనిపోయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమని సాయిరాజ్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఐదో తరగతి చదువుతున్నస్టూడెంట్ జింక సాయిరాజ్(10) పాముకాటుతో శనివారం తెల్లవారుజామున చనిపోయాడు. అతని తల్లిదండ్రులు జింక గంగామణి, మురళీ నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందినవారు. కూలీ పని చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది.
శుక్రవారం అర్ధరాత్రి అతనికి పాము కరిచినా అటు హాస్టల్ సిబ్బంది, ఇటు పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో చనిపోయాడు. పైగా పాముకాటుతో కాకుండా జ్వరంతో వాంతులు చేసుకుని చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా హాస్టల్ వార్డెన్ సందీప్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసి, చేతులు దులుపుకొన్నారు. శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆదివారం కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఫోన్ లోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఒక్క సాయిరాజ్ విషయంలోనే కాదు.. హాస్టళ్లలో ఇటీవల చనిపోయిన ఇతర స్టూడెంట్ల విషయంలోనూ ఆఫీసర్లు, సర్కారు పెద్దలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
