తీసేసిన ఒరాకిల్ ఉద్యోగులకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారంటే..!

తీసేసిన ఒరాకిల్ ఉద్యోగులకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారంటే..!

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచ వ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయటం భారీ చర్చకు దారితీసింది. చాలా మంది టెక్కీలు తాము అనేక సంవత్సరాలుగా కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నామని.. అయినా కంపెనీ తమను నిర్దాక్ష్యణంగా తీసేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకరు తనకు క్యాన్సర్ ఉందని 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కంపెనీ తొలగించిందని పోస్ట్ చేస్తే.. మరొక మహిళ తాను ప్రెగ్నెంట్ అని కూడా జాలి లేకుండా తొలగించిందంటూ పోస్టు చేశారు. ఇలా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

అయితే అసలు కంపెనీలో ఎంతకాలం ఎంత జీతానికి పనిచేసిన వాళ్లు లేఆఫ్స్ కింద పరిహారం రూపంలో ఎంత డబ్బు పొందుతారనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఉదాహరణకు ఎంత జీతం ఉంటే చివరికి ఎంత డబ్బు అందుకుంటారో టెక్కీలు పరిశీలిద్దాం.. 

Oracle సెవెరెన్స్ ప్యాకేజీ వివరాలు:

* కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం.
* టర్మినేషన్ తేదీ వరకు ఒక నెల అన్-పెయిడ్ వేతనం.
* అర్హులైన ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ.
* ఒక నెల నోటీసు పీరియడ్ జీతంతో పాటు, అదనంగా రెండు నెలల జీతం.

రూ.10 లక్షల ప్యాకేజీతో 2ఏళ్లు  పనిచేస్తే:
ఒరాకిల్ సంస్థ ప్రకటించిన సెవరెన్స్ రూల్స్ ప్రకారం రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీతో 2 ఏళ్లు పనిచేసిన టెక్కీకి అందే పరిహారం లెక్కిద్దాం. రెండు ఏళ్ల సర్వీసుకి గానూ 30 రోజుల జీతం రూ.83వేల 333, ఒక నెల నోటీసు పీరియడ్ జీతం రూ.83వేల 333, అదనంగా ఇచ్చే రెండు నెలల టాప్-అప్ జీతం రూ.లక్షా 66వేల 666 కలిపి రూ.3లక్షల 33వేల 332 అందుతాయి. దీనికి తోడు టర్మినేషన్ వరకు రావాల్సిన ఒక నెల అన్-పెయిడ్ వేతనం రూ.83వేల 333 కూడా కలిపితే మొత్తం సుమారు రూ.4లక్షల 16వేల 665 వరకు క్యాష్ రూపంలో అందుకుంటారు. అయితే రెండేళ్లు చేసిన టెక్కీకి గ్రాట్యుటీ వర్తించదు. కేవలం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మాత్రమే అదనంగా ఉంటుంది. అంటే ఉద్యోగికి దాదాపు రూ.4.16 లక్షల నుంచి రూ.4.50 లక్షల మధ్య పరిహారం రావొచ్చు. 

5 ఏళ్ల నుంచి పనిచేస్తూ రూ.20లక్షల ప్యాకేజీలో ఉంటే:
ఒరాకిల్ సంస్థలో రూ.20 లక్షల వార్షిక ప్యాకేజీతో5 ఏళ్లు పూర్తి చేసిన టెక్కీకి, కంపెనీ రూల్స్ ప్రకారం భారీ పరిహారం అందుతుంది. 5 ఏళ్ల సర్వీసుగానూ ఏటా 15 రోజుల చొప్పున మొత్తం 75 రోజుల జీతం రూ.4లక్షల 16వేల 665 లభిస్తుంది. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ జీతం, కంపెనీ అదనంగా ఇస్తున్న రెండు నెలల టాప్-అప్ జీతం కలిపితే మెుత్తం రూ.4లక్షల 99వేల 998 అవుతుంది. అలాగే 5 ఏళ్లు పూర్తి చేసినందున గ్రాట్యుటీ రూపంలో సుమారు రూ.4లక్షల 80వేల 769 అందుతాయి. వీటికి తోడు ఒక నెల అన్-పెయిడ్ శాలరీని కూడా కలుపుకుంటే.. సదరు ఉద్యోగికి మొత్తం సుమారు రూ.15లక్షల 64వేల 098 వరకు సెవరెన్స్ ప్యాకేజీ లభిస్తుంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అదనంగా ఉంటుంది కాబట్టి.. ఆ టెక్కీకి దాదాపు రూ.16 లక్షలకు పైగానే చేతికి వచ్చే అవకాశం ఉంది.

10 ఏళ్ల నుంచి పనిచేస్తూ రూ.25లక్షల ప్యాకేజీలో ఉంటే:
ఒరాకిల్ సంస్థలో రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీతో 10 ఏళ్లు నుంచి పనిచేసిన టెక్కీకి, కంపెనీ ప్రకటించిన సెవరెన్స్ రూల్స్ ప్రకారం భారీ మొత్తం అందుతుంది. 10 ఏళ్ల సర్వీసుగానూ ఏటా 15 రోజుల చొప్పున మొత్తం 5 నెలల జీతం రూ.10లక్షల 41వేల 665 లభిస్తుంది. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ జీతం, కంపెనీ అదనంగా ఇస్తున్న రెండు నెలల టాప్-అప్ జీతం తోడవుతాయి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినందున గ్రాట్యుటీ రూపంలో సుమారు రూ.12లక్షల 01వేల 923 అందుతాయి. వీటికి తోడు టర్మినేషన్ వరకు రావాల్సిన ఒక నెల అన్-పెయిడ్ వేతనంకలుపుకుంటే, సదరు సీనియర్ టెక్కీకి మొత్తంగా దాదాపు రూ.30లక్షల 76వేల 920 వరకు సెవరెన్స్ ప్యాకేజీ అందొచ్చు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అదనంగా ఉంటుంది కాబట్టి.. ఉద్యోగికి దాదాపు రూ.32 లక్షలకు పైగానే చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తీసుకున్న లెక్కలు అంచనాలు మాత్రమే వాస్తవంగా అందే ప్రయోజనాల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు.