వెండి ధర లక్షలు లక్షలు పెరుగుతుందంటూ ప్రచారం : సోషల్ మీడియాలో కథనాలపై అనలిస్టులు ఏమంటున్నారు..?

వెండి ధర లక్షలు లక్షలు పెరుగుతుందంటూ ప్రచారం : సోషల్ మీడియాలో కథనాలపై అనలిస్టులు ఏమంటున్నారు..?

ట్రంప్ యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంగారు పుట్టిస్తుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో అర్థం కావటం లేదు. యుద్ధం మొదలైప్పటి నుంచి మార్కెట్ నుంచి లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా.. సోషల్ మీడియాలో వెండి ధరలపై ఊహాగానాలు, కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. 2026 డిసెంబర్ నాటికి వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయని.. ధరలు అమాంతం పెరుగుతాయని.. ఈ సారి కిలో వెండి 15. 20 లక్షల రూపాయల వరకు వెళ్లొచ్చని.. కిలో వెండి 30 లక్షల రూపాయల వరకు కూడా వెళ్లొచ్చని ప్రచారం సోషల్ మీడియాలో విస్త్రృతంగా సాగుతుంది.

ఇటీవలే వెండి ధరలు అమాంతం పెరిగాయి. జనవరి నెలలో కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయల వరకు వెళ్లింది. ఆ తర్వాత సగానికి సగం పడిపోయింది. నెల రోజులుగా యుద్ధం జరుగుతున్నా.. వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. యుద్ధం తర్వాత వెండి ధర పడిపోయింది. అంతర్జాతీయంగా ఒక్కసారిగా తగ్గిన వెండి ధరల సమయంలోనే.. వెండిపై ఓ కొత్త ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. 

రాబోయే నెలల్లో.. అంటే 2026 డిసెంబర్ నాటికి కిలో వెండి 20 లక్షల రూపాయలు దాటుతుంది అంటూ కొందరు పోస్టులు పెట్టటం.. సోషల్ మీడియాలో కొన్ని కథనాలు రావటం కలకలం రేపుతోంది. దీనిపై అప్రమత్తం అయిన అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు.. వెండి ధరపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించారు. డీకార్లీ ట్రేడింగ్ సహ వ్యవస్థాపకురాలు కార్లీ గార్నర్ కిట్కో న్యూస్‌తో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి వెండి ఔన్సు ధర 1,000 డాలర్లకు చేరుతుందనే ఆప్షన్లనుCME లిస్ట్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఆ ధర వద్ద ట్రేడ్స్ చేసుకోలేదని వివరించారు. మార్కెట్‌లో దీనికి సంబంధించి ఎటువంటి 'ఓపెన్ ఇంట్రెస్ట్' లేదని.. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.

వెండి ధర అంత పెరిగే అవకాశం లేదని.. అలాంటిది జరగదని అంటున్నారు. మొన్నటికి మొన్న పెరిగిన వెండి ధర కూడా కృత్రిమంగా సృష్టించిందని.. దీని వల్ల చాలా మంది పెట్టుబడిదారులు నష్టపోయారని.. ఇలాంటి వార్తల వల్ల చిన్నా చితక, మధ్యతరగతి పెట్టుబడిదారులు మరింత నష్టపోయే అవకాశం ఉందని భారతీయ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.