17వ శతాబ్దంలో తెలంగాణ నేలపై మొఘల్ పాలన అరాచకాలు, భూస్వాముల నిరంకుశత్వం, దేశముఖ్‌ల దోపిడీలు తీవ్రంగా సాగుతున్న కాలం. ఆ సమయంలో ఒక సామాన్య కల్లుగీత కార్మికుడు తన కత్తిని ఖడ్గంగా మార్చి, అణగారిన బహుజన కులాలను ఏకం చేశాడు. వలసవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి సొంతరాజ్యం స్థాపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన జీవితం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు. అది సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజాస్వామిక ఆశయాలకు ప్రతీక. తెలంగాణ చరిత్రలో ‘పాపడు’గా ప్రసిద్ధి చెందిన ఈ వీరుడు హిందూ ధర్మ రక్షకుడిగా, అపర శివాజీగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు.
పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18న ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ్ కులంలో జన్మించాడు. తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్ చిన్నతనంలోనే మరణించగా, తల్లి సర్వమ్మ అతడిని ఒంటరిగా పెంచింది. తల్లి పేరును ముందు పెట్టుకుని ‘సర్వాయి పాపన్న’గా ప్రసిద్ధి చెందడం ఆయన ప్రత్యేకత. మొఘల్ సైనికులు, జమీందారులు, దేశముఖ్‌లు రైతుల నుంచి అతిశయ భూమి పన్నులు, కల్లుగీత కార్మికుల నుంచి అక్రమ వసూళ్లు చేసి ప్రజలను వేధించేవారు. ఈ అన్యాయాలు చూసి యుక్తవయసులోనే పాపన్న తిరగబడ్డాడు.
జీవితాన్ని మార్చిన సంఘటన
ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. నది సమీపంలో మిత్రుడితో ఉన్నప్పుడు ఒక మొఘల్ సైనికుడు అతడి మిత్రుడిని అవమానించి తన్నడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలో పాపన్న తన కల్లు గీత కత్తిని ఉపయోగించి సైనికుడిని చంపాడు. ఇది ఆయన పోరాట ప్రారంభం. మొదట్లో గెరిల్లా యుద్ధాల ద్వారా ధనికులు, వ్యాపారులపై దాడులు చేసి, దోపిడీ చేసిన సంపదను పేదలకు పంచేవాడు. ఇలా రాబిన్ హుడ్ లాంటి ఇమేజ్ ఏర్పడింది.
క్రమంగా వివిధ కులాలు, మతాలు, బడుగు బలహీన వర్గాల నుంచి అనుచరులను సమీకరించాడు. ఆయన సైన్యం 10,000 నుంచి 12,000 వరకు విస్తరించిందని చారిత్రక ఆధారాలు చెబుతాయి. పాపన్న ఖిలాషాపూర్‌ను తన కేంద్రంగా చేసుకుని కోటలు నిర్మించాడు. 1675లో సర్వాయి పేటలో మొదటి కోట, తర్వాత తాటికొండ, వేములకొండ, షాపూరం వంటి ప్రాంతాల్లో కోటలు నిర్మించి తన పాలన విస్తరించాడు.
తెలంగాణ పౌరుషానికి ప్రతీక
భువనగిరి, తాటికొండ, కొలనుపాక, చెరియాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్ వంటి ప్రాంతాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఆయన పాలనలో చెక్ డ్యామ్‌లు, నీటి పారుదల వ్యవస్థలు, దేవాలయాల నిర్మాణం జరిగాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాపన్న ప్రభావాన్ని గుర్తించి, రుస్తుమ్ దిల్ ఖాన్‌ను పంపి అణచివేయాలని ప్రయత్నించాడు. రుస్తుమ్ దిల్ ఖాన్ స్వయంగా మూడు నెలల పాటు యుద్ధం చేసినా ఓడిపోయి వెనక్కి తిరిగాడు. 1707లో ఔరంగజేబు మరణంతో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని 1708 ఏప్రిల్ 1న వరంగల్ కోటను ఆక్రమించాడు. గోల్కొండ కోటపై కూడా దాడి చేసి బహుజన జెండా ఎగురవేశాడని జానపద కథలు చెబుతాయి. ఆయన పాలన సుమారు 30 సంవత్సరాలు కొనసాగింది. 1710లో మొఘల్ దళాలు ఆయన కోటను ముట్టడించి ఓడించాయి. 1874లో బ్రిటీష్ చరిత్రకారుడు జె.ఏ. బాయల్ ఈ జానపద సాహిత్యాన్ని రికార్డు చేయడంతో ఆయన చరిత్ర బయటపడింది. ఆర్కియాలజికల్ ఆధారాలు, శాసనాలు, కోట శిథిలాలు ఆయన ఉనికిని నిరూపిస్తాయి. నేటి తెలంగాణలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రాష్ట్ర స్థాయిలో జరుపుకుంటున్నారు. ఆయన జీవితం ఆదర్శం.
- ఎల్లబోయిన వెంకటేశ్వర్లు
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
