ఐటీ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో ఏకంగా 12వేల మందిని తొలగించడం, రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఉంటాయన్న సంకేతాలు దేశంలోని ఐటీ హబ్ నగరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఈ లేఆఫ్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. AI రాకతో టెక్కీల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా, వారి సొంతింటి కల కూడా చెదిరిపోయే స్థితికి పరిస్థితులు మారటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తోంది.
బెంగళూరు రియల్టీపై లేఆఫ్స్ నీడ..
బెంగళూరులోని సర్జాపూర్, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటించడంతో.. కొత్తగా అపార్ట్‌మెంట్లు కొనేందుకు సిద్ధమైన టెక్కీలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల ప్రీమియం, లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు భారీగా మందగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఏ ఉద్యోగం ఉంటుందో.. ఏది ఊడుతుందో తెలియని సందిగ్ధత మధ్య కోట్ల రూపాయల హోమ్ లోన్ తీసుకోవడానికి ఎవరూ సాహసించడం లేదట.
లోన్ల భారంతో టెక్కీల ఆర్థిక కష్టాలు..
ఇప్పటికే అపార్ట్మెంట్లు కొన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ప్యాకేజీ ఉన్న టెక్కీలు.. ధైర్యంగా కోటిన్నర నుంచి రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్లను బ్యాంక్ లోన్లతో కొని ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో.. నెలకు లక్ష రూపాయలకు పైగా చెల్లించాల్సిన EMI భారం చాలా ఫ్యామిలీలను కుంగదీస్తోంది. ఒరాకిల్ ఇచ్చిన సెవరెన్స్ ప్యాకేజీ కేవలం కొన్ని నెలల ఈఎంఐలకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత మరో ఉద్యోగం దొరకడం కష్టమైతే.. అపార్ట్‌మెంట్‌ను అమ్ముకోవాల్సి వస్తుందని లేదా బ్యాంకులు జప్తు చేస్తాయనే ఆందోళన ఇప్పుడు టెక్కీలను వెంటాడుతోంది.
ఏఐ ప్రభావం వల్ల ఐటీ కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. మనుషుల కంటే మెషీన్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో.. టెక్కీల ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అనుకున్న వారు ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల బెంగళూరులో రెంటల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. అపార్ట్‌మెంట్ల అమ్మకాలు మాత్రం పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి ఒరాకిల్ లేఆఫ్స్ కేవలం ఒక కంపెనీ సమస్యగా కాకుండా.. ఐటీ హబ్ నగరాల్లోని రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ట్రిగర్ పాయింట్ అవుతుందనే భయాలు పెరుగుతున్నాయి. టెక్కీల సొంతింటి కల నెమ్మదిగా ఇప్పుడు ఏఐ మేఘాల చాటున కనుమరుగవుతోంది.
