సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఏడాది తర్వాత భర్తను పరిచయం చేసిన బ్యూటీ!

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఏడాది తర్వాత భర్తను పరిచయం చేసిన బ్యూటీ!

విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. లేటెస్ట్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిజానికి ఆమె వివాహం ఏడాది క్రితమే జరిగినప్పటికీ, అప్పట్లో ఆ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఇప్పుడు తన సొంతూరిలో భర్తతో కలిసి మొదటి యానివర్సరీని ఘనంగా జరుపుకున్నట్లు పోస్ట్‌లు పెట్టింది.

హ్యాపీ మ్యారీడ్ లైఫ్!

అయితే తమన్నా తన భర్త ఎవరు? ఆయన పేరు ఏంటి? వంటి వివరాలను  మాత్రం వెల్లడించలేదు. కేవలం ఫోటోలను, వీడియోలను మాత్రమే షేర్ చేసింది. ఈ క్రమంలో శ్రీముఖితో పాటు పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమాజంలోని అడ్డంకులను అధిగమించి, ప్రేమించిన వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తమన్నా నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

మస్తాన్ నుంచి తమన్నాగా.. 

గతంలో తమన్నా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె పుట్టుకతో అబ్బాయి. అసలు పేరు మస్తాన్ అని తెలిపింది. మా నాన్నకు కొడుకు కావాలని, అమ్మకు కూతురు కావాలని ఉండేది. దేవుడు ఇద్దరి కోరికల మధ్య కన్‌ఫ్యూజ్ అయి నన్ను పుట్టించాడు. అందుకేనేమో నేను ఆపరేషన్ చేయించుకుని నా పేరును తమన్నాగా మార్చుకున్నాను. హీరోయిన్ తమన్నా కంటే ముందే నేను ఈ పేరు పెట్టుకున్నాను అని ఆమె గర్వంగా చెప్పింది.

శ్రీముఖితో ప్రాణస్నేహం

ముంబైలో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, తమన్నా ఎదుర్కొన్న సామాజిక వివక్ష అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 కంటెస్టెంట్ గా పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పరిచయమైన యాంకర్ శ్రీముఖితో ఆమెకు విడదీయలేని బంధం ఉంది. సొంత బంధువులు దూరం పెట్టినప్పుడు శ్రీముఖి అక్కున చేర్చుకుంది. శ్రీముఖి తనను కుటుంబ సభ్యురాలిలా చూసుకుంటుందని తమన్నా చెప్పింది.

తమన్నా కేవలం నటి మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ మాజీ మంత్రి కావడం విశేషం. 2019లో మంగళగిరిలో లోకేశ్‌పై, 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచింది. నిజమైన ప్రేమకు రూపంతో సంబంధం లేదని, అది మనసులకు సంబంధించినదని తమన్నా తన పెళ్లి ద్వారా మరోసారి నిరూపించిందంటూ తమన్నాకు  కంగ్రాచ్యులేషన్స్చెబుతున్నారు  నెటిజన్లు .