తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ చౌర్యం వల్ల విద్యుత్ సంస్థలకు అపారనష్టం వాటిల్లడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. డిస్కంలు కొంటున్న మొత్తం కరెంట్ లో 8-9% ఎటు పోతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 1.40 లక్షల కనెక్షన్లలో విద్యుత్ చోరీ జరిగి సంస్థలకు 150 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తున్నది.
2024-–25 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ నగరం లో 88,186 కనెక్షన్లలో విద్యుత్ చౌర్యం జరిగి సంస్థకు రూ. 105.39 కోట్ల నష్టం జరుగగా, 2025-– 26 ఆర్థిక సంవత్సరం అర్ధభాగంలో 46,566 కనెక్షన్లలో విద్యుత్ చౌర్యం జరిగి రూ. 45.34 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. ఈ డిస్కం పరిధిలోని హబ్సిగూడలో 16,539, మేడ్చల్ సర్కిల్ లో 15,709, బంజారాహిల్స్‌లో 10,473, సైబర్ సిటి సర్కిల్లో 9,966 కనెక్షన్లలో కరెంట్ చౌర్యం జరిగినట్టు తెలుస్తున్నది.
ఉత్తర డిస్కం పరిధిలో ఏడాదిన్నరలో 4,734 కనెక్షన్లలో చౌర్యం జరిగి సంస్థకు రూ. 2.77 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. ఇంతేగాక కొన్ని వాణిజ్య సంస్థల్లో కూడా విద్యుత్ చౌర్యం విపరీతంగా జరుగుతున్నట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. ఇవన్నీ ఇప్పటివరకు పట్టుబడ్డ కేసుల్లోని గణాంకాలు మాత్రమే. ఇంకా పట్టుబడని కేసులు ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు.
విద్యుత్ చౌర్యం నేరం
విద్యుత్ సంస్థలు తమ విజిలెన్స్సెల్స్ ద్వారా ఆకస్మిక దాడులు చేస్తున్నా విద్యుత్ చౌర్యం ఆగడం లేదు. ముఖ్యంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో అందులో ముఖ్యంగా సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లో కరెంట్ చౌర్యం అధికంగా జరగడం గమనార్హం. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ చౌర్యానికి కనిపించే ముఖ్య కారణం... విద్యుత్ చౌర్యాన్ని సామాన్య ప్రజలు, తదితరులు దానినొక చిన్న తప్పుగా భావించడమే.
ఈ నేరం గురించిగాని దానికి విధించే శిక్షల గురించిగానీ వారిలో అవగాహన లేకపోవడం మరో కారణం. వాస్తవానికి విద్యుత్ చౌర్యం ఒక తీవ్రమైన నేరం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 135 గురించి తెలిసినవారెవ్వరూ విద్యుత్ చౌర్యానికి సాహసించరు. ఆ చట్టం గురించి ఏ మాత్రం అవగాహన ప్రజలలో లేకపోవడం వల్లనే ఇంతమంది చౌర్యానికి పాల్బడుతున్నారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 లోని సెక్షన్ 135 విద్యుత్ చౌర్యం గురించి వివరిస్తూ, ఆ చౌర్యానికి శిక్షలను కూడా తెలియజేస్తున్నది.
సెక్షన్ 135 తెలిపే విషయం...
- సెక్షన్ 135 (విద్యుత్ చౌర్యం) (ఎ) విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్, అండర్ వాటర్ విద్యుత్ లైన్ల నుంచిగానీ లేదా సర్వీస్ వైర్ల నుంచిగానీ లేదా సర్వీస్ ఫెసిలిటీ నుంచిగానీ విద్యుత్‌ని ఒక కనెక్షన్‌కు వాడుకోవడం నేరమవుతుంది.
- (బి) ఒక ఎలక్ట్రిసిటీ మీటర్‌ను టాంపర్ చేసినా, టాంపర్ చేసిన మీటర్‌ను వాడుకొన్నా, వాస్తవ కరెంట్ రీడింగ్‌కు అవరోధం కలిగించేలా కరెంట్ రివర్సింగ్ ట్రాన్స్ఫార్మర్నుగానీ లూప్ కనెక్షన్ గానీ లేదా ఏదేని ఉపకరణాన్ని వాడినా అది విద్యుత్ చౌర్యమవుతుంది.
- (సి) వాస్తవ విద్యుత్ రీడింగ్‌కి అవరోధం కలిగించేందుకు, ఎలక్ట్రిసిటీ మీటర్ గానీ, దానికి చెందిన వైర్లనుగాని, పరికరాలకుగాని నష్టం కలిగించినా లేదా ధ్వంసం చేసినా అది విద్యుత్ చౌర్యం అవుతుంది.
- (డి) టాంపర్ చేసిన కరెంట్ మీటర్ వాడుకోవడం కూడా విద్యుత్ చౌర్యంగానే పరిగణిస్తారు.
- (ఇ) అనుమతించిన ఉపయోగానికి కాకుండా అదనంగా వేరే అవసరాల కోసం విద్యుత్ వాడుకోవడం కూడా విద్యుత్ చౌర్యమవుతుంది. ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష గానీ, ఫైన్ గానీ లేదా రెండూ విధిస్తారు.
శిక్షల గురించి అవగాహన కల్పించాలి
నేరం పునరావృతమైన సందర్భాల్లో విధించే శిక్షలని, ఫైన్లని కూడా సెక్షన్ 135 విపులంగా విశదీకరిస్తుంది. నేర తీవ్రతను, సందర్భాలననుసరించి అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు, సంస్థకు జరిగిన నష్టానికి భారీగా జరిమానా పడే అవకాశముంది. అంతేకాదు కరెంట్ సరఫరాను కూడా నిలిపివేయడం జరుగుతుంది. విద్యుత్ చౌర్యం ఒక తీవ్రమైన నేరమన్న అవగాహన చాలామందిలో లేకపోవడం వల్లనే ఈ చౌర్యాన్ని అతి తేలికగా భావించి నేరానికి పాల్పడుతున్నారు.
దీనికి ఒకే ఒక పరిష్కారం ప్రజలకు ఈ చట్టం గురించి, శిక్షల గురించి అవగాహన కలిగించాలి. ఆ బాధ్యతని విద్యుత్ సంస్థలు తీసుకోవాలి. వివిధ మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా కావచ్చు లేదా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములుగా చేసుకోవాలి. ఈ నేరం విషయంలో, శిక్షల విషయంలో అవగాహన కల్పించగలిగితే విద్యుత్ చౌర్యానికి కట్టడిపడే అవకాశముంది. ప్రజల్లో ఈ అవగాహన రానంతవరకు కరెంట్ చౌర్యం జరుగుతూ విద్యుత్ సంస్థలకు తీవ్రమైన నష్టాలు కలుగుతాయి.
- బసవరాజు నరేందర్ రావు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
