ఇండస్ట్రీలో లేడీ టెక్నీషియన్స్ తక్కువే. డైరెక్టర్స్ మరీ తక్కువ. కొందరు ఎలాగో ముందుకు దూసుకొచ్చి మెగాఫోన్ పట్టినా.. స్టార్స్‌ని డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్లినవాళ్లు ఒకళ్లిద్దరే. వారిలో ఫరాఖాన్ పేరును కచ్చితంగా చెప్పుకోవాలి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఫరా.. డైరెక్టర్‌గా మారి మై హూ నా, ఓం శాంతి ఓం లాంటి బ్లాక్ బస్టర్స్ తీశారు. ఇప్పుడు మరో పెద్ద చాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లెజెండ్ రాజేష్ ఖన్నా బయోపిక్‌ని డైరెక్ట్ చేయనున్నారు.
ఆనంద్, ఆరాధన, కటీ పతంగ్, అమర్‌ప్రేమ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి రొమాంటిక్ కింగ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఖన్నా. ఆయన పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో సంచలనాలున్నాయి. నటి అంజు మహేంద్రుతో రిలేషన్, డింపుల్ కపాడియాతో పెళ్లి, విడాకులు, టీనా మునిమ్‌తో లవ్ అఫైర్ వంటివి చాలానే ఉన్నాయి. వాటన్నింటి గురించి ‘డార్క్ స్టార్: ద లోన్లీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా’ బుక్‌లో రాశారు గౌతమ్ చింతామణి. దాని ఆధారంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిఖిల్ అద్వానీ. ప్రస్తుతం ఆయన పాత్ర పోషించే నటుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.