గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఊహించని విధంగా భారతదేశంలోని కండోమ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధంతో సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల కొరత ఇప్పుడు భారతీయ కండోమ్ తయారీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. దాదాపు రూ.8వేల కోట్లు విలువ కలిగిన ఈ పరిశ్రమ.. ఏటా 400 కోట్లకు పైగా కండోమ్ యూనిట్లను తయారు చేస్తూ దేశ జనాభా నియంత్రణలో పాత్ర పోషిస్తోంది.
కండోమ్ తయారీలో అత్యంత కీలకమైన రెండు ముడి పదార్థాల రేట్లతో పాటు సరఫరాను ఈ యుద్ధం దెబ్బకొట్టింది. మొదటిది సిలికాన్ ఆయిల్. దీనిని కండోమ్ తయారీలో లూబ్రికెంట్‌గా ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీనికి భారీ కొరత ఏర్పడింది. రెండవది అమ్మోనియా. తయారీలో లాటెక్స్‌ను స్థిరీకరించడానికి ఇది ఎంతో అవసరం. గల్ఫ్ సంక్షోభం కారణంగా అమ్మోనియా ధరలు ఏకంగా 40 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు ప్యాకేజింగ్ కోసం వాడే పీవీసీ, అల్యూమినియం ఫాయిల్ రేట్లు కూడా పెరగడంతో తయారీదారులపై భారం రెట్టింపు అయ్యింది.
►ALSO READ | ప్రీమియం పెట్రోల్ బీభత్సంగా పెరిగింది : లీటర్‌కు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, క్యూపిడ్ లిమిటెడ్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ సెగను ఎదుర్కొంటున్నాయి. పెట్రోకెమికల్స్ వాడే ప్రతి వస్తువుపై ఈ ప్రభావం ఉందని కర్ణాటక డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రభుత్వ పరంగా కూడా ముడిసరుకు కేటాయింపుల్లో 35 శాతం వరకు కోత విధించే అవకాశం ఉండటంతో ఉత్పత్తి ప్రక్రియ నెమ్మదించొచ్చని తెలుస్తోంది. ముడిసరుకు లభ్యత లేకపోవడం, లాజిస్టిక్స్ సమస్యల వల్ల ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి.
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కండోమ్ మార్కెట్ తక్కువ ధర - ఎక్కువ అమ్మకాల పైనే నడుస్తోంది. అందువల్ల కండోమ్స్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటేనే జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ స్కీమ్స్ ఫలితాలను ఇస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తయారీ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ధరలు పెంచక తప్పని స్థితిలో ఉన్నాయి. ధరలు పెరిగితే సహజంగానే డిమాండ్ తగ్గుతుంది. ఇది కేవలం వ్యాపార నష్టం మాత్రమే కాదు, దీర్ఘకాలంలో దేశ జనాభా నియంత్రణ లక్ష్యాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెల్త్ కేర్ నిపుణులు అంటున్నారు.
