సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిల్గిరిపేట గ్రామ శివారులో ప్రాజెక్టు చెరువు సమీపంలో ఒక రైతు పొలంలో సుమారు 50 ముసలి గుడ్లు కనిపించాయి. రైతు భయాందోళనతో పక్క రైతును పిలిచి చూడగా అప్పుడే గుడ్ల నుంచి బయటికి వచ్చిన కొన్ని మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
కొన్ని సంవత్సరాల కింద ఇట్లాంటి సంఘటన జరిగిందని రైతులు చెప్పారు. ఏటా ఫిబ్రవరి, మార్చిలో రాతి పలకలు, ఇసుక తిన్నెల్లో మొసళ్లు గుడ్లు పెట్టి పొదుగుతాయి. జూన్, జులైలో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఒక్కో మొసలి దాదాపు 30 గుడ్లు పెడుతుంది. మడుగులో పెరిగే చేపలను తింటూ మొసళ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో రాతి పలకల పైకి వెళ్లి సేదతీరుతుంటాయి.
తెలంగాణలో మొసళ్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే..
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం అభయారణ్యం పరిధిలోని గోదావరిలో ఉన్న ఎల్మడుగు మొసళ్లకు ఆవాసంగా విలసిల్లుతోంది. ఇక్కడ వందకు పైగా మొసళ్లు ఉన్నట్టు ఫారెస్ట్ అధికారుల అంచనా. ఎల్ మడుగును మొసళ్ల సంరక్షణ కేంద్రంగా గుర్తించాలని 1972లో అప్పటి పీసీసీఎఫ్ పుష్పకుమార్ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. ఈ మేరకు ప్రభుత్వం 1978లో దానిని మొసళ్ల సంరక్షణ, పునరావాస కేంద్రంగా ప్రకటించింది.
చుట్టూ ఎత్తైన కొండలు, రాతి పలకలతో గోదావరిలో సహజ సిద్ధంగా ఎల్ మడుగు ఏర్పడింది. ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండగా, ఏడు కిలోమీటర్లు కోర్, రెండు కిలోమీటర్లు బఫర్ ఏరియాతో విస్తరించింది. దాదాపు 20 మీటర్ల లోతు ఉంటుంది. రాతి పలకలపై ప్రవహించే నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఏదాడి పొడవునా నిండుకుండను తలపిస్తోంది.
