హైదరాబాద్ శివారులో ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ భీకర ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తెలు ప్రవళిక, హరిప్రియ, కుమారుడు విక్రాంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
పెద్ద శబ్దంతో సిలిండర్ పేలడంతో ఉలిక్కిపడిన స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మేడ్చల్ 108 అంబులెన్స్ ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు.
