కొత్త ఏడాదిలో ఎఫ్ డీలు బెటర్

కొత్త ఏడాదిలో ఎఫ్ డీలు బెటర్
  • 2023 లో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దగా పెరగకపోవచ్చన్న  కోటక్ సెక్యూరిటీస్
  • గోల్డ్‌‌‌‌లో పెట్టుబడులతో మంచి రిటర్న్స్‌‌‌‌
  • డాలర్ మారకంలో రూపాయి 79.50–86.50 మధ్యే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫిక్స్డ్‌‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ), బాండ్లు వంటి ఫిక్స్డ్‌‌ ఇన్‌‌కమ్ ఇచ్చే అసెట్స్ మంచి రిటర్న్స్‌‌ ఇస్తున్నాయని  కోటక్ సెక్యూరిటీస్ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఇన్వెస్టర్లు వీటిపై ఓ కన్ను వేయాలని సలహా ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రస్తుతం టాప్ బ్యాంకులు సైతం 7 శాతం వరకు ఎఫ్‌‌డీలపై వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.  షేరు మార్కెట్‌‌ గురించి చెబుతూ,  మన స్టాక్ మార్కెట్‌‌ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని, ఇన్వెస్ట్ చేసే ముందు అన్నీ ఆలోచించాలని వెల్లడించింది.  ‘మార్కెట్ అవుట్‌లుక్ 2023–  ఇయర్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌’ పేరుతో ఓ రిపోర్ట్‌‌ను కోటక్ సెక్యూరిటీప్ రిలీజ్ చేసింది. కొత్త ఏడాదిలో  ఈక్విటీ, కమొడిటీస్‌‌, కరెన్సీ మార్కెట్‌‌లు ఎలా కదులుతాయో అంచనావేసింది. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన ఇన్‌‌ఫ్లేషన్‌‌, వడ్డీ రేట్లు..వంటి అంశాలు ఈ ఏడాది మార్కెట్‌‌లో వోలటాలిటీ  పెంచాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది దేశ మార్కెట్ల నుంచి 30 బిలియన్ డాలర్లను బయటకు తీసేశారని, అయినప్పటికీ మార్కెట్‌‌లు పెద్దగా పడలేదని గుర్తు చేశారు. సిప్‌‌లు పెరగడం, ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉండడంతో డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మార్కెట్‌‌కు సపోర్ట్‌‌గా నిలిచారని చెప్పారు. నిఫ్టీ 17,000 వరకు వచ్చేంత వరకు  మార్కెట్‌‌లోకి ఎంటర్ అవ్వొద్దని సలహా ఇచ్చారు. 

కొత్త ఏడాదిలో షేరు మార్కెట్..

వచ్చే ఏడాది దేశ స్టాక్ మార్కెట్‌‌ల ఫండమెంటల్స్ మిశ్రమంగా ఉంటాయని శ్రీకాంత్ చౌహన్ అన్నారు. షేర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ 18,717 దగ్గర (బేస్ కేస్‌‌)  కదలాడొచ్చని, బుల్లీష్ మార్కెట్ ఉంటే 20,919 వరకు వెళ్లొచ్చని అంచనావేశారు. బేర్ మార్కెట్ అయితే నిఫ్టీ 16,515 వరకు పడిపోతుందని అన్నారు.  15,000 లెవెల్‌‌ కిందకి రాకపోవచ్చని చెప్పారు. వచ్చే ఏడాది 16,500 నుంచి  18,500 మధ్య కదలాడుతుందని పేర్కొన్నారు. క్రెడిట్ గ్రోత్ బాగుండడంతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎన్‌‌బీఎఫ్‌‌సీల పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆటో, మాన్యుఫాక్చరింగ్‌‌, ఇంజినీరింగ్ సెక్టార్ల పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని అంచనావేశారు. గ్లోబల్‌‌ ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్‌‌లోకి జారుకుంటుండడంతో కెమికల్స్‌‌, మెటల్స్ సెక్టార్ల పెర్ఫార్మెన్స్ బాగోకపోవచ్చని పేర్కొన్నారు. మరో వైపు ఐటీ సెక్టార్ గురించి అంచనావేయడానికి మరో క్వార్టర్‌‌‌‌ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇన్వెస్టర్లు లోకల్ మార్కెట్‌‌పై ఆధారపడి నడిచే కన్జూమర్, మాన్యుఫాక్చరింగ్‌‌, ఇంజినీరింగ్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై ఫోకస్ పెట్టాలన్నారు. ఎగుమతులపై ఆధారపడే కంపెనీలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.  షేర్లు పడిన కొద్దీ కొనుగోలు చేసే పద్ధతిని ఫాలో కావాలని పేర్కొన్నారు. 

గోల్డ్‌‌  పైకే.. 

ఆర్థిక వ్యవస్థలు రెసిషన్‌‌లోకి జారుకునేటప్పుడు గోల్డ్ (ఇన్వెస్ట్‌‌మెంట్‌‌)  మంచి పెర్ఫార్మెన్స్ చేస్తోందని కోటక్ సెక్యూరిటీస్‌‌  కమొడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్ర రావు పేర్కొన్నారు. గత ఏడు రెసిషన్‌‌లలో ఐదు సార్లు గోల్డ్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉందని అన్నారు. వచ్చే ఏడాది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌‌లోకి జారుకుంటుందనే అంచనాలు పెరగడంతో గోల్డ్‌‌ పెర్ఫార్మెన్స్ కొత్త ఏడాదిలో మెరుగ్గా ఉంటుందని అంచనావేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌లో ఆల్‌‌టైమ్ హైకి చేరుకున్న గోల్డ్‌‌, డాలర్ వాల్యూ పెరగడంతో కిందకి పడిందని అన్నారు. వచ్చే ఏడాది మొదటి క్వార్టర్ వరకు ఫెడ్ కఠినతరమైన మానిటరీ పాలసీని కొనసాగించొచ్చని, ఆ తర్వాత గ్రోత్‌‌కు ప్రయారిటీ ఇవ్వడానికి రేట్లు తగ్గించొచ్చని అంచనావేశారు. రెసిషన్‌‌ భయాలు, ఇన్‌‌ఫ్లేషన్ ఇంకా గరిష్ట స్థాయిల్లో ఉండడం, డాలర్ వాల్యూ పడడం, జియో పొలిటికల్ టెన్షన్ల వలన వచ్చే ఏడాది గోల్డ్‌‌ మెరవొచ్చని పేర్కొన్నారు. సిల్వర్‌‌ గురించి చెబుతూ.. చైనా కొవిడ్ రిస్ట్రిక్షన్లు తగ్గిస్తే తప్ప ఈ మెటల్‌ మంచి పెర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చని అంచనావేశారు. ఫెడ్ పాలసీ, డిమాండ్ అవుట్‌‌లుక్ కూడా సిల్వర్‌‌‌‌ను నడిపిస్తాయని అన్నారు. క్రూడాయిల్ విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్‌‌ బ్యారెల్‌‌కు 69– 90 డాలర్ల మధ్య కదలాడొచ్చని రవీంద్ర రావు పేర్కొన్నారు. ప్రొడక్షన్‌‌ను ఒపెక్ తగ్గించొచ్చని ఇది క్రూడ్‌‌కు సపోర్ట్‌‌గా ఉంటుందన్నారు. మరోవైపు వెస్ట్రన్ దేశాలు విధించిన ప్రైస్‌‌ లిమిట్‌‌పై రష్యా ఇంకా స్పందించలేదు. రష్యా స్పందన బట్టి క్రూడ్ కదలికల్లో ఒక క్లారిటీ రావొచ్చని అన్నారు. సాధారణంగా గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అయితే క్రూడాయిల్ ధర పడుతుంది. చైనా ఎకానమీ రికవరీపై కాపర్ భవిష్యత్‌‌ ఆధారపడి ఉందని రవీంద్ర రావు పేర్కొన్నారు. 

రూపాయి ఇంకా బలహీనంగా..

డాలర్ మారకంలో రూపాయి  కదలికలు విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లపై ఎక్కువగా ఆధారపడతాయని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ డెరివేటివ్స్‌‌‌‌ ఎనలిస్ట్ అనింద్య బెనర్జీ అన్నారు. ఈ ఏడాదిలో మాదిరి కరెన్సీ మార్కెట్‌‌‌‌లో వొలటాలిటీ కనిపించకపోవచ్చని, కానీ, కొత్త ఏడాదిలో కనీసం 7–9 శాతం వొలటాలిటీ చూస్తామని పేర్కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి వచ్చే ఏడాది 79.50–86.50 రేంజ్‌‌‌‌లో కదలాడొచ్చని అంచనావేశారు. కాగా, ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ 11 శాతం నష్టపోయింది. 82.80 వద్ద బుధవారం సెటిలయ్యింది.