
టోక్యో : జపాన్ కారు కంపెనీ నిస్సాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పినట్టు జపాన్ మీడియా పేర్కొంది. తన వ్యాపారాలను పునరుద్ధరించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4,800 ఉద్యోగాలను తీసివేస్తున్నట్టు మేలోనే నిస్సాన్ ప్రకటించింది. దీంతో వర్క్‌ఫోర్స్‌ను 1,39,000కు కుదిస్తున్నట్టు పేర్కొంది. మే ప్రకటన అనంతరం మళ్లీ ఉద్యోగుల కోతపై కంపెనీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. నిస్సాన్ వ్యాపారాలు కూడా బాగా మందగించాయి. కంపెనీ నికర లాభాలు గతేడాది పదేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. వచ్చే 12 నెలలు కూడా కంపెనీకి కాస్త కష్టకాలమేనని తెలిసింది. గురువారం కంపెనీ తన తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించబోతోంది. ఈ రిపోర్ట్‌లపై తాము ఇప్పుడేమీ కామెంట్ చేయమని నిస్సాన్ అధికార ప్రతినిధి చెప్పారు. కంపెనీకి అమెరికాలో, యూరప్‌లో అమ్మకాలు పడిపోయాయి. ఆర్థిక మోసాల కారణంతో కంపెనీ మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ అయ్యారు. తన ఫ్రెంచ్ పార్టనర్ రెనాల్ట్ నుంచి నిస్సాన్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ జపనీస్ కారు కంపెనీలో రెనాల్ట్‌కు 43 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఉద్యోగాల కోత దక్షిణ అమెరికా, ఇతర రీజన్లలో ఉన్న కొన్ని ఫ్యాక్టరీలలో ఉండనుందని జపాన్ మీడియా పేర్కొంటోంది.