ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు 3 వేల కోట్లు

ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు 3 వేల కోట్లు
  •  రెండేండ్లుగా చెల్లించని రాష్ట్ర సర్కార్
  • 15 లక్షల మంది ఎదురుచూపులు  
  • ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న కాలేజీలు 
  • అప్పులు తెచ్చి చెల్లిస్తున్న స్టూడెంట్ల తల్లిదండ్రులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్లకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ పైసలు ఇస్తలేదు. రెండేండ్లుగా చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.3,100 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కోసం దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్‌‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు డబ్బులు కట్టకపోవడంతో కాలేజీ మేనేజ్‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో స్టూడెంట్ల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు పేరెంట్స్‌‌ బయట అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారు. తెచ్చిన అప్పులకు రోజురోజుకు వడ్డీ పెరిగిపోతోందని, సర్కార్ వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్లకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.2,400 కోట్లు అవసరమవుతాయి. 2019–20 అకడమిక్ ఇయర్ కు గాను రాష్ట్ర సర్కార్ సగం బకాయిలు కూడా చెల్లించలేదు. ఇంకా రూ.800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక 2020–21కి సంబంధించి ఒక్కరికన్నా చెల్లించలేదు. అధికారులు స్టూడెంట్లకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ శాంక్షన్‌‌ చేసి, టోకెన్లు జారీ చేస్తున్నా అకౌంట్లలో మాత్రం డబ్బులు పడటం లేదు. మొత్తం రెండేండ్లకు కలిపి రూ.3,100  కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 
రూల్స్ పాటిస్తలే.. 
స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కోసం అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే స్టూడెంట్లు అప్లికేషన్ పెట్టుకోవాలి. దరఖాస్తుల పరిశీలనలో అర్హులని తేలితే వెంటనే 25 శాతం రీయింబర్స్ మెంట్ చెల్లించాలి. అకడమిక్‌‌ ఇయర్‌‌ మిడిల్‌‌లో 50 శాతం, మిగిలినవి చివరలో చెల్లించాలి. కానీ ఈ నిబంధనలను రాష్ట్ర సర్కార్ పాటించడం లేదు. సాధారణంగా అకడమిక్‌‌ ఇయర్‌‌ ఏటా మార్చిలోనే ముగుస్తుంది. కానీ ఏటా సకాలంలో ఫీజులు చెల్లించడం లేదు. స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ పెండింగ్ లో ఉండడంతో కాలేజీ మేనేజ్‌‌మెంట్లు స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. బకాయిలు చెల్లిస్తేనే, సర్టిఫికెట్లు ఇస్తామని అంటున్నాయి. దీంతో డబ్బుల్లేక చాలామంది స్టూడెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇంకొంత మంది ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పైచదువులు ఆపేస్తున్నారు. 
300 కాలేజీలు మూత... 
ఓవైపు కరోనా, మరోవైపు ఫీజులు రాకపోవడంతో రాష్ట్రంలో చాలా కాలేజీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ భారంతో దాదాపు 300 కాలేజీలు మూతబడినట్లు మేనేజ్‌‌మెంట్లు చెబుతున్నాయి. వీటిలో 161 ఇంటర్‌‌, 72 డిగ్రీ కాలేజీలతో పాటు మరికొన్ని ఉన్నాయి. దీంతో 4వేల మంది లెక్చరర్లు రోడ్డునపడ్డారు. సర్కార్ సకాలంలో స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి కాలేజీలు నడిపిస్తున్నామని, వడ్డీలు పెరిగిపోతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బకాయిలు ఇలా... 
ఇయర్    అప్లికేషన్లు    బకాయిలు
2019-20    12.73 లక్షలు    రూ.800 కోట్లు
2020-21    12.85 లక్షలు    రూ.2,300 కోట్లు 
రెండేండ్లుగా రాలే..
సిటీలోని ఏవీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ స్కాలర్‌‌షిప్‌‌, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ ఇంకా రాలేదు. దీంతో చేసేదేం లేక మొబైల్ మెకానిక్‌‌గా పార్ట్‌‌ టైం జాబ్‌‌ చేసి హాస్టల్, కాలేజీ ఫీజులు కట్టిన. ఇప్పటికైనా సర్కార్ బకాయిలు చెల్లించి, నాలాంటి స్టూడెంట్ల ఇబ్బందులు తొలగించాలి.                                                                           - ఉదయ్‌‌, స్టూడెంట్‌‌