- బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి
- కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కూకట్ పల్లి, బాలానగర్ లో గతేడాది కల్తీ కల్లు తాగి 14 మంది మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కల్తీ కల్లు ఘటనలో 100 మంది హాస్పిటల్ లో చేరగా, 13 కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. ఈ కేసులు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయని, చార్జిషీట్లు దాఖలు చేయలేదని తెలిపారు.
కేవలం రికార్డు కోసం కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ వారు బెయిల్‌పై విడుదలయ్యారని పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. డ్రగ్స్ కేసులపై సీఎం చర్యలు తీసుకుంటున్నట్లే.. కల్తీ కల్లు కేసుపై కూడా తీసుకోవాలన్నారు. కొంతమంది క్లోరల్ హైడ్రేట్, డయాజెపామ్, అల్ప్రాజోలం వంటి హానికర పదార్థాలను కలిపి కల్లు తయారు చేస్తున్నారని తెలిపారు.
మరణించిన 14 మంది, ఆస్పత్రిలో చేరిన దాదాపు 100 మంది లైసెన్సు పొందిన దుకాణాల్లోనే కల్లు తాగారని వెల్లడించారు. అందువల్ల ప్రాణ నష్టం, ఆస్పత్రుల ఖర్చులకు ఎక్సైజ్ శాఖ బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. మృతులు బలహీన వర్గాలకు చెందినవారు కావడంతో నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల పేర్లు, అరెస్టుల వివరాలు ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ నిరాకరిస్తోందని, ఈ మొత్తం వ్యవహారం గోప్యంగా ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
