ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌‌‌‌.. టాప్‌‌-2 సీడ్స్గా అర్జున్‌‌‌‌, గుకేశ్

ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌‌‌‌.. టాప్‌‌-2 సీడ్స్గా అర్జున్‌‌‌‌, గుకేశ్

న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్ ఎరిగైసి అర్జున్,  వరల్డ్ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌  ప్రతిష్టాత్మక ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌‌‌‌లో టాప్2 సీడెడ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అర్జున్ టాప్ సీడ్‌‌‌‌గా, గుకేశ్ రెండో సీడ్‌‌‌‌గాబరిలోకి దిగుతున్నారు. విమెన్స్ సెక్షన్‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపికి రెండో సీడింగ్ లభించింది.  ఉజ్బెకిస్తాన్‌‌‌‌లోని సమర్‌‌‌‌కండ్‌‌‌‌లో సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు జరగనున్న ఈ నాలుగో ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీ  అత్యంత కీలకమైనది. 

టోర్నీలో ఓపెన్‌‌‌‌, విమెన్స్ సెక్షన్లలో టాప్–2లో నిలిచే  ప్లేయర్లకు 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌‌‌లో  డైరెక్ట్ బెర్తు లభిస్తుంది. క్యాండిడేట్స్ టోర్నీలో విన్నర్‌‌‌‌‌‌‌‌ రాబోయే వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు క్వాలిఫై అవుతాడు. ఈసారి గ్రాండ్ స్విస్‌‌‌‌లో ప్రైజ్ మనీ కూడా భారీగా పెరిగింది. ఓపెన్‌‌‌‌లో  దాదాపు రూ. 5.35 కోట్లు (గతంలో 3.94 కోట్లు),  విమెన్స్‌‌‌‌ విభాగంలో రూ. 1.97 కోట్లు (గతంలో రూ. 1.19 కోట్లు) అందజేస్తారు. 

2024 జులై–2025 జూన్ మధ్య కచ్చితంగా 30 పైచిలుకు క్లాసికల్ రేటెడ్ గేమ్స్‌‌‌‌లో పోటీ పడాలన్న నిబంధన వల్ల మాజీ వరల్డ్ చాంపియన్స్‌‌‌‌ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్, విశ్వనాథన్ ఆనంద్ వంటి స్టార్ ప్లేయర్లు ఈసారి బరిలో లేరు. అలాగే, మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌ డింగ్ లిరెన్, గత మూడు గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లలో ఆడిన ఫాబియానో కరువానా  కూడా పాల్గొనడం లేదు. కరువానా  ఇప్పటికే గతేడాది  ఫిడే సర్క్యూట్ గెలిచి 2026 క్యాండిడేట్స్‌‌‌‌ టోర్నీకి ఎంపికయ్యాడు. 

ఇండియా నుంచి ఆర్. ప్రజ్ఞానంద (నాలుగో సీడ్‌‌‌‌), నిహాల్ సరిన్ (20వ సీడ్‌‌‌‌) కూడా బరిలో ఉన్నారు. 11 రౌండ్ల స్విస్ ఫార్మాట్‌‌‌‌లో జరిగే ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో మొత్తం 116 మంది, విమెన్స్‌‌‌‌లో 56 మంది ప్లేయర్లు తలపడతారు. విమెన్స్‌‌‌‌లో మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌ టాన్ ఝోంగీ టాప్ సీడ్‌‌‌‌గా ఉండగా. ఇండియా స్టార్ ప్లేయర్ కోనేరు హంపి రెండో సీడ్‌‌‌‌గా బరిలో నిలిచింది. గతేడాది విమెన్స్ విన్నర్‌‌‌‌‌‌‌‌ ఆర్. వైశాలి మరోసారి టైటిల్‌‌‌‌ కోసం  పోటీ పడనుంది.