గ్వాడలజారా: ఫిఫా వరల్డ్ కప్‌లో కొలంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన గ్రూప్–కే లీగ్ మ్యాచ్‌లో 1–0తో కాంగో డీఆర్‌పై గెలిచి ఆరు పాయింట్లతో నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ 76వ నిమిషంలో డిఫెండర్ డేనియల్ మునోజ్ గోల్ కొట్టాడు.
ఈ టోర్నీలో అతనికి ఇది రెండో గోల్. మ్యాచ్ ఆరంభం నుంచి కొలంబియా ప్లేయర్లు కాంగో గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేశారు. తొలి 20 నిమిషాల్లోనే కొలంబియాకు చెందిన స్టార్ ఆటగాళ్లు జేమ్స్ రోడ్రిగ్జ్, లూయిస్ డియాజ్ సంధించిన ఐదు ప్రమాదకరమైన షాట్లను కాంగో గోల్‌కీపర్ లియోనెల్ ఎంప్సి అద్భుతంగా అడ్డుకున్నాడు.
కానీ డిఫెండర్ మునోజ్ కొట్టిన లెఫ్ట్ ఫుట్ షాట్ కాంగో డిఫెండర్ కాళ్లకు తగిలి నెట్లోకి దూసుకెళ్లడంతో గోల్ కీపర్ అడ్డుకోలేకపోయాడు. చివర్లో లూయిస్ డియాజ్ కొట్టిన రెండు గోల్స్‌ను రెఫరీ ఫౌల్, ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో కొలంబియా ఆధిక్యం పెరగలేదు. కాంగో గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కొలంబియా సీనియర్ ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్జ్ తన 10వ వరల్డ్ కప్ మ్యాచ్ పూర్తి చేసి, ఫ్రైడీ రింకాన్, కార్లోస్ వాల్డెర్రామా సరసన నిలిచాడు. ఇక వరల్డ్ కప్ చరిత్రలో ఆడిన 23 మ్యాచ్‌లలో కొలంబియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ను కూడా గోల్స్ లేకుండా (0-–0తో) డ్రా చేసుకోక పోవడం విశేషం.
