బెజ్జంకి, వెలుగు: అప్పల బాధతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ పల్లె గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై ఓదెలు తెలిపిన వివరాల ప్రకారం.. చిలాపూర్ పల్లె గ్రామానికి చెందిన గొంటి బాలయ్య(50) తన పొలంతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది నుంచి పంట దిగుబడి రాకపోవడంతో పాటు అతని తల్లి క్యాన్సర్ బారిన పడడంతో రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలని 15 రోజులుగా బాధ పడుతున్నాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని భార్యఅంజవ్వ కు చెప్పి ఇంటి నుంచి వెళ్లి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కొడుకు గొంటి రాణా ప్రతాప్ సిద్దిపేటలో కోచింగ్ తీసుకుంటుండగా, ఐదేళ్ల కూతురు ఉంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
