‘నాన్న’కూ 7 నెలల సెలవులు

‘నాన్న’కూ 7 నెలల సెలవులు

దునియా మొత్తంల హ్యాపీయెస్ట్ దేశం ఏదని సర్వే చేస్తే.. తప్పకుండా ఫిన్లాండ్​కే టాప్ ర్యాంక్ దక్కుతుంది. అట్లనే ప్రపంచం మొత్తంల పిల్లలకు స్వర్గంలాంటి దేశం ఏదంటే కూడా ఫిన్లాండే ఫస్ట్ ప్లేస్​లో ఉంటుందేమో. ఈ దేశంలో పుట్టే పిల్లలకు సర్కారు ఇచ్చే కానుకలు అలా ఉంటాయి మరి. ఇక్కడి ప్రభుత్వం పిల్లల పెంపకానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదిగితే దేశానికే మేలని, అందుకే.. వాళ్ల ఎదుగుదల కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ దేశం కోసం పెట్టే పెట్టుబడేనని భావిస్తుంది. అందుకే.. పిల్లలను మరింత బాగా పెంచేందుకని ఫిన్లాండ్ సర్కారు కొత్త పేరెంటల్ పాలసీని ప్రకటించింది. బిడ్డలను కనే తల్లిదండ్రులకు ఈ పాలసీ కింద చెరో 7 నెలల పాటు పేరెంటల్ లీవ్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా చాలా విషయాల్లో ఫస్ట్​ప్లేస్​లో నిలిచిన ఫిన్లాండ్.. తాజాగా చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు అమ్మా, నాన్నలిద్దరికీ ఏకంగా7 నెలల చొప్పున సెలవులు ఇస్తున్న తొలి దేశంగానూ రికార్డ్ కొట్టేసింది.

సెలవులు మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఫిన్లాండ్​లో బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి 4 నెలలు, తండ్రికి 2 నుంచి 3 నెలల లీవ్స్ ఇస్తున్నారు. ఇకపై కొత్త పాలసీ ప్రకారం ఇద్దరికీ చెరో 7 నెలలు పెయిడ్ లీవ్స్ ఇస్తారు. ఇద్దరికీ కలిపి 14 నెలల సెలవులుంటాయి. వీటిని అవసరాన్ని బట్టి ఇద్దరూ ఒకరి సెలవులను మరొకరు వాడుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ పాలసీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచే అమలు కానుంది. ఇక తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఉన్నట్లయితే (సింగిల్ పేరెంట్స్)కు వారు మొత్తం 14 నెలల సెలవులనూ వాడుకునేందుకు కూడా చాన్స్ ఉంటుందట.

అమ్మా, నాన్నకు సమాన బాధ్యతలు..

సాధారణంగా ఎక్కడైనా బిడ్డలను చూసుకునేందుకని తల్లికి మాత్రమే పేరెంటల్ లీవ్ ఇస్తారు. తండ్రికి కూడా ఇచ్చినా, చాలా తక్కువే ఉంటాయి. కానీ పిల్లల పెంపకంలోనూ సమానత్వం ఉండాలని ఫిన్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అమ్మతో పాటు నాన్న స్పర్శ, సంరక్షణ వల్ల శిశువుల ఎదుగుదల మరింత బాగా ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫిన్లాండ్ కేబినెట్​లోని ఓ మంత్రి వెల్లడించారు. శిశువు ఎదుగుదలలో తండ్రి పాత్ర కూడా చాలా కీలకమని ఆయన తెలిపారు. ఇక ఫిన్లాండ్ లో బిడ్డ పుట్టగానే ప్రభుత్వం నుంచి రకరకాల కిట్లు అందిస్తారు. చిన్నారులకు బెడ్, బట్టలు, ఉయ్యాల, బొమ్మలు, పుస్తకాలను కూడా ఉచితంగానే అందిస్తారు. పిల్లలను రోజంతా సంరక్షించేందుకు వీలు లేని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉంచేందుకు ఉచిత యూనివర్సల్ డేకేర్ సెంటర్లను కూడా ఫిన్లాండ్ సర్కారు నిర్వహిస్తోంది.