జూబ్లీహిల్స్, వెలుగు: నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పార్కు లోపల కిందపడిన చెట్ల ఆకులు, ఇతర వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఒకచోట కుప్పగా వేయగా.. ప్రమాదవశాత్తు ఆ చెత్తకుప్పకు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. మెయిన్ రోడ్డుపైకి పొగలు వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అదే సమయంలో పార్కులో వాకింగ్ చేస్తున్న ప్రజలు మంటలను గమనించి వెంటనే గార్డెనింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకోగా, పార్కు సిబ్బంది కూడా అప్రమత్తమై సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’ చేపట్టాలని భావిస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
