హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో రాష్ట్ర ఫైర్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. రానున్న వేసవికాలం నేపథ్యంలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ పరిధిలోని 53 కమర్షియల్ కాంప్లెక్సులు సహా మొత్తం70 బిల్డింగ్స్‌లో తనిఖీలు నిర్వహించింది. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. ఈ మేరకు ఫైర్ సర్విసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సోమవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అత్యవసర ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు.
గత నెల 28వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఓఆర్‌ఆర్ పరిధిలోని కమర్షియల్ కాంప్లెక్సులు సహా బిల్డింగ్స్‌లో తనిఖీలు చేసినట్టు వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ, ప్రాణ రక్షణకు ముప్పు కలిగించే ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. భవనాల్లో నివసించే వారి ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులను గుర్తించినట్టు పేర్కొన్నారు. సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
