న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు: 8మంది మృతి

న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు: 8మంది మృతి

న్యూజిలాండ్  క్రిస్ట్ చర్చ్ సెంట్రల్ సిటీలోని మూడు మసీదుల్లో అగంతకులు కాల్పులు జరిపారు. మొత్తం ముగ్గురు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.  కాల్పుల్లో దాదాపు 8 మంది మృతి చెందినట్లు తెలిపారు న్యూజిలాండ్ పోలీసులు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాల ప్రాంతంలో…. బ్లాక్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి.. ఆల్ నూర్ మసీదు లోపలకు వెళ్లి కాల్పులు జరిపాడు.  అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు… అగాంతకుడిపై కాల్పులు జరిపారు. కాల్పులతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నగరంలోని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  మరోవైపు అగంతకుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్లో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడింది. మూడో టెస్ట్ కోసం రెడీ అవుతున్న టైంలో ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా… ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడ్డామని టీమ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు.  దాడి నుంచి జట్టు మొత్తం తప్పించుకుందని, ఇదో భయంకరమైన అనుభవం అంటూ ట్వీట్ చేశాడు. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయన్నారు తమీద్. అటు కాల్పుల ఘటనతో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న టెస్ట్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

దేశ చరిత్రలో చీకటి రోజు: న్యూజిలాండ్  ప్రధాని
ఘటనపై న్యూజిలాండ్  ప్రధాని జెసిండా స్పందించారు…దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు అన్నారు.  ఇలాంటి దాడి సరైంది కాదన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు  జెసిండా ఆర్డన్ తెలిపారు.