
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ అలైడ్హెల్త్ సైన్స్కోర్సు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ... ఫస్ట్ టైమ్ కాళోజీ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోని తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కోర్సు ప్రవేశపెట్టారన్నారు. మూడేండ్ల థియరీ, వన్ఇయర్ ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా అడ్మిషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించారన్నారు.
గాంధీ మెడికల్ కాలేజీలో 160 మంది పరీక్షలు రాయగా, ఐదుగురు మాత్రమే పాస్ అయ్యారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 746 మంది ఎగ్జామ్ రాయగా, కేవలం 25 మంది మాత్రమే పాస్అయ్యారన్నారు. కోర్సుకు తగిన సిలబస్, క్లాస్ లు సరిగా నిర్వహించలేదన్నారు. కాలేజీ అధికారులు, ఫ్యాకల్టీ నిర్లక్ష్యం కారణంగానే ఫెయిలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సుకు సక్రమంగానే క్లాస్ లు నిర్వహించామని, కాళోజీ హెల్త్ వర్సిటీలో పరీక్షలు నిర్వహించి, పేపర్లు దిద్దారని, దీంతో తమకు సంబంధం లేదని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ లను రాసుకునే చాన్స్ ఉందన్నారు. ఆస్పత్రి ఎదుట స్టూడెంట్స ఆందోళన సరికాదన్నారు.