హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పేట్ల బుర్జులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో క్రైం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును పక్కా ఆధారాలతో కోర్టుల్లో నిరూపించి నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసు ఆఫీసర్లను వీసీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది మే వరకు కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులు అందజేశారు. తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ పేరిట వీటిని అందజేశారు.
వివిధ కేసుల్లో ఉత్తమ దర్యాప్తు జరిపి ఐదేండ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా చేసిన 14 మంది ఈ కేటగిరిలో అవార్డులందుకున్నారు. ఇందులో నలుగురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, 10 మంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద డ్యూటీలో చురుగ్గా ఉన్న 18 మందికి కూడా అవార్డులు దక్కాయి. ఇందులో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
అవార్డులు అందుకున్నది వీరే..
బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో కె. మురళీధర్ (ఇన్‌స్పెక్టర్, సీసీఎస్), ఎం. ముత్తు యాదవ్ (ఎస్‌హెచ్‌వో, రాజేంద్ర నగర్), ఏ. రాజశేఖర్ రెడ్డి (ఎస్సై, రాజేంద్రనగర్), ఎం. స్వామి (ఎస్సై, సైఫాబాద్) అవార్డులు అందుకున్నారు. అలాగే, కోర్టు డ్యూటీ ఆఫీసర్లలో నేనావత్ శేఖర్ (పీసీ, సనత్ నగర్), పి.వీరాంజనేయులు (పీసీ, గుడిమల్కాపూర్), వై. ఆంజనేయులు (పీసీ, గోషామహాల్), ఎం.సుమలత (డబ్ల్యూపీసీ, షీటీమ్స్), బి.సుదర్శన్ (హెచ్‌సీ, అబిడ్స్), కె.సాయి కిరణ్ (పీసీ, భవానీ నగర్), బిక్షపతి (హెచ్‌సీ, మీర్‌పేట), కె.శ్రీనివాస్ రెడ్డి (హెచ్‌సీ, బాలాపూర్), వి.శ్రీనివాస్ (పీసీ, ఆదిభట్ల), ఎస్. మల్లేష్ నాయక్ (పీసీ, మెహిదీపట్నం) ఉన్నారు.
బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీ కింద 18 మంది అవార్డులు అందుకున్నారు. ఇక రిటైర్మెంట్తర్వాత కూడా ఫిట్‌నెస్, క్రమశిక్షణతో యువతకు రోల్ మోడల్‌గా నిలిచిన రిటైర్డ్ అడిషనల్ డీసీపీ సర్దార్ హరి హర్ సింగ్ కు, ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ వరకు ఉన్న ఇంగ్లీష్ ఛానల్ ను రిలే ఈతతో దాటిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ క్వీనీ విక్టోరియా, తన తల్లి క్వీనా విక్టోరియాతో కలిసి కాటలినా ఛానల్, కుక్ స్ట్రెయిట్ సముద్ర భాగాలను ఈదిన తెలంగాణ తొలి పిన్న వయస్కుడిగా నిలిచిన స్టీఫెన్ కుమార్, నారాయణగూడలో తనకు దొరికిన రూ.లక్షా 30 వేలను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న జెప్టో డెలివరీ బాయ్మిర్జా ముజఫర్, ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన రూ. లక్షా 20 వేలను పోలీసులకు అందజేసిన ఆటో డ్రైవర్ మోదం వెంకటయ్య, పార్సిగుట్టలో దొరికిన స్మార్ట్ ఫోన్ ను అప్పగించిన జి. వెంకటేశ్‌కు అవార్డులు ఇచ్చి సత్కరించారు.
