ఆగస్టు నెలాఖరు నాటికి 80 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

ఆగస్టు నెలాఖరు నాటికి 80 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
  • పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ప్రకటన   
  • గత ఎన్నికల్లో లేట్‌‌గా ప్రకటించి నష్టపోయినం
  • ఈ సారి బీఆర్ఎస్ కన్నా ముందే ప్రకటిస్తం
  • ఇయ్యాల ఖర్గే సమక్షంలోజూపల్లి పార్టీలో చేరుతరని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించేందుకు రెడీ అయింది. 80 మంది అభ్యర్థులతో ఈ నెలాఖరు నాటికి తొలి జాబితాను ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.‌ పీసీసీ, ఏఐసీసీ నేతలతో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకు ఫస్ట్ లిస్టును వెల్లడిస్తామన్నారు. అయితే, ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు.  


గత ఎన్నికల్లో నష్టపోయినందుకే.. 
అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం వల్లే గత ఎన్నికల్లో నష్టపోయామని పార్టీ నేతలు భావిస్తున్నారని, ఈ సారి అలా‌ జరగకూడదనే ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని ఠాక్రే చెప్పారు. గత ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటించి బీఆర్‌ఎస్ లాభపడిందన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని ఠాక్రే వెల్లడించారు.