‘బీమా’ అప్లై చేసుకునే విధానంపై అవగాహన కల్పించని అధికారులు

‘బీమా’ అప్లై చేసుకునే విధానంపై అవగాహన కల్పించని అధికారులు
  • 2020 నుంచి  చేపల వేటకు వెళ్లి 16 మంది మృతి
  • ఇప్పటి వరకు నాలుగు కుటుంబాలకే అందిన బీమా

2020 ఏప్రిల్​ 16న  పాలమూరు జిల్లా దేవరకద్ర మండలం కోయిల్​సాగర్​ గ్రామానికి చెందిన రాజేశ్​ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అప్పటికే ఆఫీసర్లు ప్రాజెక్టు తూము నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ విషయం తెలియక రాజేశ్​ తూము పక్కనే చేపలు పట్టేందుకు వల వేసిండు. అయితే వలను తూము లాగేయంతో అందులో చిక్కుకుని చనిపోయిండు. మత్స్యకారులకు అందించే బీమా కోసం ఆయన భార్య లక్ష్మమ్మ అప్లై చేసుకుంది. ఏడాదిన్నర దాటుతున్నా..  నేటికీ బీమా రాలేదు. ఆఫీసర్లను అడిగితే అప్లికేషన్​ను హైదరాబాద్​కు పంపించామని, అక్కడి ఆఫీసర్లు ఢిల్లీకి కూడా పంపించినట్లు రిపోర్టులు వచ్చాయని సమాధానం ఇచ్చారు. కానీ, పరిహారం ఎప్పుడు వచ్చేది మాత్రం వారు చెప్పడం లేదు.  

మహబూబ్​నగర్​, వెలుగు :
 జిల్లాలో మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదు. చెరువులు, కుంటలు, చెక్​డ్యామ్​లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయిన వారి కుటుంబాలకు ఏండ్లు గడుస్తున్నా బీమా డబ్బులను అందించడం లేదు.

మహబూబ్​నగర్​ జిల్లాలో..
జిల్లాలో ఫిషర్​మెన్ కోఆపరేటివ్​ సొసైటీలు181 ఉండగా, 10,766 మంది సభ్యులు ఉన్నారు. ఫిషర్​ఉమెన్​ కోఆపరేటివ్​ సొసైటీలు 20 ఉండగా, 753 మంది మెంబర్లు ఉన్నారు. ఈ సొసైటీలలో ఉన్న సభ్యులు వారి వారి ప్రాంతాల్లో ఉండే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, చెక్​డ్యామ్​లు, ప్రాజెక్టుల్లో చేపల పడుతూ ఉపాధి పొందుతుంటారు. అయితే చేపల వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వం రూ.4 లక్షల బీమాను కల్పించింది.  ఈ ఏడాది ఆ  బీమాను రూ.5 లక్షలకు పెంచారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.3 లక్షలు కాగా, రాష్ర్ట ప్రభుత్వం వాటా  రూ.2 లక్షలుగా ఉంది. కానీ, జిల్లాలో 2020–-21, 2021–-22   ఆగస్టు నెల వరకు మొత్తం 16 మంది చనిపోయారు. వీరిలో 2020లో చనిపోయిన  రెండు కుటుంబాలకు ఇటీవల రూ.4 లక్షల చొప్పున అధికారులు బీమా చెక్కులను అందించారు. మిగతా వారికి ఇంత వరకు పైసలు అందించలేదు. ఇందులో కొందరు చనిపోయి రెండేళ్లు కావస్తుండగా, మరికొంత మంది చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. కానీ బీమా పైసలు రాకపోవడంతో మృతుల కుటుంబాలు పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి.  

అవగాహన లేక..
నేషనల్​ ఫిషరీస్​ డెవలప్​మెంట్​బోర్డు (ఎన్ఎఫ్​డీబీ) ద్వారా మత్స్యకారులకు బీమా అందిస్తారు.  అయితే ఈ స్కీమ్​పై అధికారులు మత్స్యకారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు  చాలా మంది బీమాకు దూరం అవుతున్నారు. చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు చనిపోతే బీమా కోసం అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఆర్ఐ పంచనామా రిపోర్ట్​, పోలీస్​ రిపోర్ట్​, లీగల్​సర్టిఫికేట్​, డెత్​ సర్టిఫికేట్​తో పాటు మరో ఐదు రకాల సర్టిఫికేట్లు అప్లికేషన్​కు జత చేయాలి.  ఈ దరఖాస్తును  స్థానిక మత్స్య శాఖ ఆఫీసులో అందించాలి. వారు  ఈ అప్లికేషన్​కు హైదరాబాద్ లోని స్టేట్​ఆఫీస్​కు.. అక్కడి నుంచి ఢిల్లీకి పంపుతారు. అయితే  అప్లికేషన్​లో  ఎలాంటి మిస్టేక్స్​ ఉన్నా.. ఫిషరీస్​ బోర్డు రిజెక్ట్​ చేస్తుంది. దీంతో అవగాహన లేక కొన్ని తప్పిదాల వల్ల మత్స్యకారులు చాలా మంది ఈ బీమాకు నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు  చాలా జరుగుతున్నా..  స్థానిక ఆఫీసర్లు ఈ బీమాకు ఎలా అప్లై చేసుకోవాలనే దానిపై కనీసం సదస్సులు కూడా నిర్వహించడం లేదు. 

ఇంజన్​ బోట్లు లేక ప్రమాదాలు..
రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు ఎక్కువగా తెప్పలు, మూడు ఫీట్లు ఉండే బెండ్లను ఉపయోగిస్తున్నారు. చేపల వల విసిరినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి నీళ్లల్లో పడిపోతున్నారు. ఈ క్రమంలో నీళ్లల్లో వేసిన వలలకు చిక్కుకొని చనిపోతున్నారు. అయితే  ఇలాంటి ప్రమాదాల నివారణకు ఇంజన్​ బోట్లను అందుబాటులోకి తేవాల్సి ఉన్నా, వాటిని సబ్సిడీల కింద కూడా మత్స్యకారులకు అందించడం లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి  వీటిని మంజూరు చేస్తున్నా, అధికారులు వాటిని బ్యాక్​ వాటర్ ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులకు మాత్రమే ఇస్తున్నారు.  ఈ  క్రమంలో చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్తున్న వారికి కూడా సబ్సిడీ కింద ఇంజన్​ బోట్లు  ఇవ్వాలని  మత్స్యకారులు కోరుతున్నారు. 

అప్లికేషన్​ను పంపినం అంటున్రు..
మా నాన్న పేరు శాంతప్ప. నాలుగు నెలల కింద  కోయిల్​సాగర్​లో  చేపల వేటకు పోయిండు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయిండు. మత్స్యకారుల బీమా కోసం అప్లై చేసినా.. కానీ ఇంత వరకు శాంక్షన్​కాలేదు. ఆఫీసర్లను అడిగితే అప్లికేషన్​ను హైదరాబాద్​కు పంపించామని చెబుతున్నారు. కానీ పరిహారం ఎప్పుడొస్తదో చెప్తలేరు. 
– వెంకటేశ్, మృతుడు శాంతప్ప కుమారుడు, కోయిల్​సాగర్